Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతిలో ముసలం.. కవితపై సొంత నేత తీవ్ర వ్యాఖ్యలు

Kalvakuntla Kavitha Facing Dissent Within Telangana Jagruthi
  • సంస్థ అధ్యక్షురాలు కవితపై అసంతృప్తి వ్యక్తం చేసిన నాయకులు
  • తాము ఎప్పటికీ కేసీఆర్‌కే కట్టుబడి ఉంటామని స్పష్టీకరణ
  • కవిత నిర్ణయాలతో కార్యకర్తల భవిష్యత్తు ప్రశ్నార్థకమన్న నేతలు
  • కవిత సామాజిక న్యాయంపై కీలక నేత రాజీవ్ సాగర్ ప్రశ్నలు
  • జాగృతి ఆశయాలు పక్కదారి పడుతున్నాయని ఆరోపణ
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సాంస్కృతిక సంస్థ తెలంగాణ జాగృతిలో అంతర్గత విభేదాలు రాజుకున్నాయి. సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంపై ఆ సంస్థకు చెందిన కీలక నేత మేడే రాజీవ్ సాగర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తామంతా కేసీఆర్ కోసమే పనిచేస్తామని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. కవిత తీసుకుంటున్న నిర్ణయాల వల్ల సంస్థలోని కార్యకర్తల భవిష్యత్తు అంధకారంలో పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాజీవ్ సాగర్ మాట్లాడుతూ, "తెలంగాణ జాగృతి నాయకులమైన మేము ఎల్లప్పుడూ కేసీఆర్ కోసమే పని చేస్తాం. ఆయన నిర్ణయమే మాకు శిరోధార్యం. కానీ, కవిత గారు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల 19 ఏళ్లుగా సంస్థ కోసం కష్టపడిన వారి జీవితాలు, రాజకీయ భవిష్యత్తు ఏం కావాలి?" అని ప్రశ్నించారు. జాగృతి సంస్థ కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఆశయాల కోసం పనిచేయాలని, కానీ ఇప్పుడు ఎవరి కోసం, ఎవరి ఆశయాల కోసం పనిచేస్తోందో అర్థం కావడం లేదని విమర్శించారు.

సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్న కవితకు రెండుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా అవకాశాలు వచ్చాయని గుర్తు చేశారు. ఆమె వెనుక నడిచిన కార్యకర్తలకు ఎలాంటి సామాజిక న్యాయం జరిగిందని నిలదీశారు. కవిత వ్యక్తిగత ఎజెండాతో పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆరోపించారు.

రాత్రింబవళ్లు మేం కవిత చెప్పినట్లు పని చేశామని, కానీ ఆమె తీసుకున్న నిర్ణయం పట్ల తామంతా బాధపడుతున్నామని అన్నారు. కవిత చేసిన పని వల్ల మా జీవితాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Kalvakuntla Kavitha
Telangana Jagruthi
BRS party
KCR
BRS
Telangana politics
internal conflicts

More Telugu News