P Chidambaram: 8 ఏళ్ల తర్వాత గుర్తొచ్చిందా?.. జీఎస్టీ తగ్గింపుపై చిదంబరం సెటైర్లు

P Chidambaram Sarcastic Remarks on GST Rate Cut After 8 Years
  • జీఎస్టీ శ్లాబులను రెండుకు తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం
  • చౌకగా మారనున్న నిత్యావసరాలు, చిన్న కార్లు, బైకులు
  • నిర్ణయాన్ని స్వాగతించినా, 8 ఏళ్ల ఆలస్యంపై చిదంబరం విమర్శ
  • ఇప్పుడే ఎందుకు మార్చారంటూ ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్
కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం స్వాగతించారు. అయితే, ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి ఎనిమిదేళ్లు ఎందుకు పట్టిందంటూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది ఎనిమిదేళ్ల ఆలస్యంగా తీసుకున్న నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు.

'ఎక్స్' వేదికగా చిదంబరం స్పందిస్తూ.. ప్రస్తుత జీఎస్టీ విధానాన్ని, ఇప్పటిదాకా ఉన్న రేట్లను మొదట్లోనే ప్రవేశపెట్టి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. 2017లో జీఎస్టీని తీసుకొచ్చినప్పటి నుంచి తాము దీని డిజైన్, రేట్లపై హెచ్చరిస్తున్నా ప్రభుత్వం తమ మాటలను పెడచెవిన పెట్టిందని ఆయన ఆరోపించారు.

ఇంతకాలం తర్వాత ప్రభుత్వం హఠాత్తుగా ఈ మార్పులు చేయడానికి గల కారణాలపై ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. "మందగించిన ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న కుటుంబ అప్పులు, పడిపోతున్న పొదుపు, త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికలు లేదా అమెరికా టారిఫ్‌ల ఒత్తిడి.. వీటన్నింటిలో ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ మార్పులపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. వీటిని 'తర్వాతి తరం సంస్కరణలు'గా ఆయన అభివర్ణించారు. సామాన్యుడి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, రైతులు, ఎంఎస్ఎంఈలు, మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకే ఈ సంస్కరణలు చేపట్టామని ఆయన తన 'ఎక్స్' ఖాతాలో తెలిపారు.
P Chidambaram
GST rates
GST reduction
Narendra Modi
Indian economy
Bihar elections
Tax reforms
MSMEs
Middle class

More Telugu News