Chandrababu Naidu: నేడు ఏపీ కేబినెట్ భేటీ .. చర్చించే కీలక అంశాలు ఇవే

Chandrababu Naidu to Chair AP Cabinet Meeting Today
  • సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 11 గంటలకు కేబినెట్ సమావేశం
  • వివిధ కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న కేబినెట్
  • రూ.53,922 కోట్ల పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదం తెలుపనున్న కేబినెట్
ఈ రోజు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడుల ప్రాజెక్టులు, భూ కేటాయింపులు, అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఈరోజు కేబినెట్‌లో రూ.53,922 కోట్ల పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో 83,437 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నట్లు అంచనా. ముఖ్యంగా ఏరోస్పేస్, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ, ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పారిశ్రామిక పార్కులు, ఎకో సిస్టం, బిజినెస్ సెంటర్ల తరహాలో అభివృద్ధికి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.

అలాగే, సీఆర్డీఏ ప్రతిపాదనలకు, అర్బన్ డిజైన్లు, ఆర్కిటెక్చరల్ గైడ్‌లైన్స్ నోటిఫికేషన్, కన్వెన్షన్ సెంటర్లకు భూ కేటాయింపులు, ఎస్పీవీ ప్రాజెక్టులకు అనుమతులు, ల్యాండ్ పూలింగ్‌కు లోబడని భూములను భూ సేకరణ ద్వారా పొందేందుకు అనుమతులు, ఇతర అంశాలపై కూడా కేబినెట్ చర్చించనుంది.

అసెంబ్లీ సమావేశాలు 18 నుంచి?

కేబినెట్‌లో అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరగనుంది. ఈ నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలనే ఆలోచన పైనా ప్రభుత్వం చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

రాష్ట్ర అభివృద్ధికి మద్దతుగా పలు ప్రైవేట్ సంస్థలకు భూముల కేటాయింపు, పెట్టుబడిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై కూడా చర్చించనున్నారు. గతంలో నిర్వహించిన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశాల్లో తీసుకున్న తీర్మానాలకు కేబినెట్‌లో అధికారికంగా ఆమోదం తెలిపే అవకాశముంది. కేబినెట్ సమావేశం అనంతరం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, వైసీపీ ఫేక్ ప్రచారాలు, ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. 
Chandrababu Naidu
AP Cabinet Meeting
Andhra Pradesh
Investment Projects
Assembly Sessions
Land Allocation
CRDA
SIPB
AP Politics

More Telugu News