Andhra Pradesh: కర్నూలులో దారుణం.. ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతండ్రినే చంపేశాడు!

Kurnool man kills father for compassionate government job
  • కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో ఘటన
  • నిద్రిస్తున్న తండ్రిని రోకలితో కొట్టి చంపిన కొడుకు
  • కారుణ్య నియామకం వస్తుందన్న దురాశే కారణం
  • సహోద్యోగి కొడుక్కి ఉద్యోగం రావడంతో కుట్ర
ప్రభుత్వ ఉద్యోగంపై ఆశతో ఓ కొడుకు దారుణానికి ఒడిగట్టాడు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం సంపాదించాలన్న దుర్బుద్ధితో కన్నతండ్రినే కిరాతకంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో బుధవారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన రామాచారి కుమారుడు వీరసాయి డిగ్రీ పూర్తి చేసి కర్నూలులోని ఓ ఫార్మసీ దుకాణంలో పనిచేస్తున్నాడు. అయితే, అతనికి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే బలమైన కోరిక ఉండేది. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం తన తండ్రితో పాటు పనిచేసే ఓ డ్రైవర్ విధుల్లో ఉండగా గుండెపోటుతో మరణించడంతో ఆయన కొడుక్కి కారుణ్య నియామకం కింద ఉద్యోగం వచ్చింది. ఈ సంఘటన వీరసాయి మనసులో ఓ దురాలోచనకు బీజం వేసింది. తండ్రి చనిపోతే తనకు కూడా అదే విధంగా ఉద్యోగం వస్తుందని బలంగా నమ్మాడు.

ఈ కుట్రను అమలు చేయడానికి సరైన సమయం కోసం ఎదురుచూశాడు. నెల రోజుల క్రితం వీరసాయి భార్య సుప్రియ రెండో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. రెండు రోజుల క్రితం తల్లి విరూపాక్షమ్మ కూడా తన పుట్టిల్లు చిన్నతుంబలం వెళ్లారు. దీంతో ఇంట్లో తండ్రీకొడుకులు ఇద్దరే మిగిలారు. మంగళవారం రాత్రి ఇద్దరూ కలిసి భోజనం చేసి నిద్రపోయారు.

అదును చూసిన వీరసాయి, బుధవారం తెల్లవారుజామున ఇంట్లోనే ఉన్న రోకలి బండ తీసుకుని గాఢనిద్రలో ఉన్న తండ్రి రామాచారి తల, నుదుటిపై విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీశాడు. ఈ విషయం బయటకు తెలియడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు వీరసాయిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతండ్రినే హతమార్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Andhra Pradesh
Veerasai
Rama Chari
Kodumur
Filicide
Compassionate appointment
Government job
Crime news
Murder for job

More Telugu News