Niranjan Reddy: కవితపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన నిరంజన్ రెడ్డి

Niranjan Reddy Indirectly Criticizes Kavitha Over Harish Rao
  • హరీశ్ రావును వెనకేసుకొచ్చిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
  • బ్రహ్మంగారికి సిద్ధప్పలా... కేసీఆర్ కు హరీశ్ అలా అని వ్యాఖ్య
  • రేవంత్ కాళ్లు మొక్కారనడం నీచమైన ఆరోపణ అని ఖండన
  • వ్యక్తిగత లాభం కోసమే హరీశ్‌పై దాడి చేస్తున్నారని విమర్శ
  • ప్రత్యర్థులకు ఊతమిచ్చేలా మాట్లాడటం సరికాదని హితవు
మాజీ మంత్రి హరీశ్ రావును లక్ష్యంగా చేసుకుని కవిత చేసిన విమర్శలపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పరోక్షంగా కవితను ఉద్దేశిస్తూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కొందరు ఎవరి ప్రయోజనాల కోసమో హరీశ్ రావును లక్ష్యంగా చేసుకున్నారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. పార్టీకి అండగా నిలవాల్సిన సమయంలో, ప్రత్యర్థులకు బలం చేకూర్చేలా మాట్లాడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా వ్యాఖ్యల వెనుక ఉన్న అజెండా ఏమిటో ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. ఏదైనా సమస్య ఉంటే చర్చించుకోవడానికి వేరే పద్ధతులు ఉంటాయని సూచించారు.

పార్టీ ఆవిర్భావం నుంచి హరీశ్ రావు ఉన్నారని నిరంజన్ రెడ్డి గుర్తుచేశారు. "బ్రహ్మంగారికి సిద్దప్ప ఎలాగో, కేసీఆర్‌కు హరీశ్ రావు అలాంటి వాడు. జలదృశ్యంలో పార్టీ గద్దె కడిగింది, జెండా కట్టింది కూడా హరీశ్ రావే" అని ఆయన అన్నారు. ఈటల రాజేందర్ పార్టీ వీడటంలో హరీశ్ పాత్ర ఉందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. వాస్తవానికి ఈటల వెళ్లకుండా చివరి వరకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది హరీశ్ రావేనని స్పష్టం చేశారు.

ఇక సీఎం రేవంత్ రెడ్డి కాళ్లను హరీశ్ మొక్కారనడం పూర్తిగా అవాస్తవమని, రాజకీయాల కోసం ఇంత నీచమైన ఆరోపణలు చేయడం తగదని నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితకు కష్టం వచ్చినప్పుడు హరీశ్ సహా పార్టీలో అందరూ బాధపడ్డారని గుర్తుచేశారు. ఎవరో చెబితే తప్పుదారి పట్టేంత బలహీనుడు కేసీఆర్ కాదని, ఆయనను ఎవరూ ప్రభావితం చేయలేరని స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ నేతలపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

Niranjan Reddy
BRS party
Harish Rao
Kavitha
internal disputes
Telangana politics
Revanth Reddy
Etela Rajender
BRS leaders
Telangana

More Telugu News