Botsa Satyanarayana: ఇవి మల్లయుద్ధాలు కావు.. దమ్ముల గురించి మాట్లాడొద్దు: బొత్స

Botsa Satyanarayana Criticizes AP Government
  • ప్రతిపక్ష హోదా ఇవ్వండి.. అసెంబ్లీలో తేల్చుకుంటామన్న బొత్స
  • కూటమి ప్రభుత్వం 2 లక్షల కోట్లు అప్పు చేసిందని ఆరోపణ
  • సుగాలి ప్రీతి కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారని ప్రశ్న
వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేవలం 15 నెలల కాలంలోనే ప్రభుత్వం ఏకంగా రెండు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని ఆయన ఆరోపించారు. ఈ విషయం వాస్తవం కాకపోతే, అందుకు సంబంధించిన పూర్తి వివరాలను తక్షణమే బయటపెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని బొత్స డిమాండ్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీ వేదికగానే అన్ని విషయాలు తేల్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కొందరు నేతలు దమ్ముల గురించి మాట్లాడుతున్నారని, ఇవి మల్లయుద్ధాలు కావని ఆయన ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపైనా బొత్స మండిపడ్డారు. ఆయనకు విషయం తెలిసి మాట్లాడుతున్నారా లేక తెలియక మాట్లాడుతున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి కుటుంబానికి ఇప్పటికీ ఎందుకు న్యాయం చేయలేకపోయారని ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ప్రభుత్వం ఎన్ని విమర్శలు చేసినా, 2029లో వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని బొత్స ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన జోస్యం చెప్పారు. ప్రభుత్వ పనితీరును ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. 
Botsa Satyanarayana
YSRCP
Andhra Pradesh
Pawan Kalyan
Sugali Preethi
AP Politics
Debt
Jagan Mohan Reddy
Assembly
Opposition

More Telugu News