Seethakka: బీఆర్ఎస్ మహిళా నేతలు జాగ్రత్తగా ఉండాలి... కవితను విమర్శిస్తే నష్టపోతారు: సీతక్క

Seethakka Warns BRS Women Leaders Against Criticizing Kavitha
  • కవిత ఎపిసోడ్ మొత్తం కేసీఆర్ కుటుంబం ఆడుతున్న డ్రామా అన్న సీతక్క
  • కాళేశ్వరం అవినీతి నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ ఎత్తుగడ అని విమర్శ
  • అక్రమ సంపాదన పంపకాల్లో తేడాలతోనే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు అని వ్యాఖ్య
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం మొత్తం ఒక పెద్ద కుటుంబ డ్రామా అని... కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ నాటకాలు ఆడుతున్నారని మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత తన కుటుంబ సభ్యులపై చేసిన ఆరోపణల వెనుక పెద్ద కుట్ర ఉందని, అవినీతి సొమ్ము పంపకాల్లో వచ్చిన తేడాల వల్లే వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఈరోజు మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ సందర్భంగా సీతక్క ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ జాతిపితగా చెప్పుకునే కేసీఆర్, తన ఇంట్లోని నలుగురు కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించుకోలేని బలహీన స్థితిలో ఉన్నారా? అని సీతక్క ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతి బండారం బయటపడేసరికి, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు సృష్టించి అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అక్రమ సంపాదన, అవినీతి డబ్బు పంచుకోవడంలో వచ్చిన విభేదాలే ఈ డ్రామాకు కారణమని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా ములుగులో తన ఓటమి విషయాన్ని కూడా సీతక్క ప్రస్తావించారు. "సంతోష్ రావుకు బినామీ అయిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వేల కోట్లు సంపాదించారని కవితే స్వయంగా ఆరోపించారు. అదే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, గత ఎన్నికల్లో ములుగులో నన్ను ఓడించడానికి వందల కోట్లు ఖర్చు పెట్టాడు. కవిత చేసిన ఈ బినామీ ఆస్తుల ఆరోపణలపై బీఆర్ఎస్ ఎందుకు స్పందించడం లేదు?" అని ఆమె నిలదీశారు.

అలాగే, కేటీఆర్ ప్రోత్సాహం లేకుండా కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం సాధ్యమేనా? అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. మొదట కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకున్న కవిత... ఇప్పుడు హరీశ్ రావు, సంతోష్క రావులను టార్గెట్ చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ మహిళా నేతలు అప్రమత్తంగా ఉండాలని సీతక్క హితవు పలికారు. "రేపు కేసీఆర్ కుటుంబం మొత్తం మళ్లీ ఒక్కటవుతుంది. అనవసరంగా కేసీఆర్, కేటీఆర్ దృష్టిలో పడాలని కవితను విమర్శిస్తే మీకే నష్టం. అలా నోరు జారిన మహిళా నాయకులు కచ్చితంగా నష్టపోతారు" అని ఆమె హెచ్చరించారు. 
Seethakka
Kavitha Kalvakuntla
BRS party
Kaleshwaram project
Telangana politics
KCR
KTR
Harish Rao
Pochampally Srinivas Reddy
Telangana news

More Telugu News