Nara Lokesh: అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతివనం.. శంకుస్థాపన చేసిన మంత్రి లోకేశ్‌

Potti Sreeramulu Memorial Park Inaugurated by Minister Lokesh in Amaravati
  • 6.8 ఎకరాల్లో 58 అడుగుల కాంస్య విగ్రహం, ఆడిటోరియం నిర్మాణం
  • స్మృతివనం ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్న మంత్రి 
  • తొలి విరాళంగా రూ.కోటి ప్రకటించిన టీజీవీ గ్రూప్
  • ప్రాణత్యాగంతో తెలుగువారికి దారిచూపిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడిన లోకేశ్‌
  • వచ్చే ఏడాది మార్చి 16 నాటికి విగ్రహావిష్కరణ చేస్తామన్న డూండి రాకేశ్‌
తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారకార్థం రాజధాని అమరావతిలో స్మృతివనం ఏర్పాటు కానుంది. తుళ్లూరు-పెదపరిమి మధ్య ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల స్థలంలో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ శంకుస్థాపన చేశారు. ఈ స్మృతివనంలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహంతో పాటు ఆడిటోరియం, మ్యూజియం, మినీ థియేటర్ నిర్మించనున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ప్రాణాలను పణంగా పెట్టి కోట్లాది మంది తెలుగువారికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. "గాంధీజీ దేశానికి స్వాతంత్ర్యం తెస్తే, పొట్టి శ్రీరాములు తెలుగుజాతికి ప్రత్యేక రాష్ట్రం సాధించారు. అందుకే ఆయనను 'ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్' అని పిలుస్తారు" అని లోకేశ్‌ గుర్తుచేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ఆయన 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసినందుకు గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. పాదయాత్ర సమయంలో ఆర్యవైశ్య సోదరులకు ఇచ్చిన హామీ మేరకు ఈ స్మృతివనం నిర్మాణానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, ఈ బృహత్కార్యానికి తమ టీజీవీ గ్రూప్ తరఫున తొలి విరాళంగా రూ.కోటి అందిస్తున్నట్లు ప్రకటించారు. పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ, స్మృతివనం నిర్మాణానికి సీఆర్డీఏ తరఫున పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేశ్‌ మాట్లాడుతూ, రాబోయే ఏడాది మార్చి 16వ తేదీ నాటికి విగ్రహాన్ని ఆవిష్కరింపజేస్తామని మాట ఇచ్చారు. అనంతరం మంత్రి లోకేశ్‌, పొట్టి శ్రీరాములు వారసులను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


Nara Lokesh
Potti Sreeramulu
Amaravati
Smriti Vanam
Telugu State
TG Bharat
Andhra Pradesh
Telugu People
Linguistic State
Dundi Rakesh

More Telugu News