BJP MLA: మహిళా ఐపీఎస్‌ను కుక్కతో పోల్చిన బీజేపీ ఎమ్మెల్యే... కర్ణాటకలో దుమారం

Ktaka MLA says woman SP acts like pet dog of Cong leaders FIR slapped by police
  • మహిళా ఎస్పీపై బీజేపీ ఎమ్మెల్యే బి.పి. హరీశ్ తీవ్ర వ్యాఖ్యలు
  • కాంగ్రెస్ నేతల ఇంట్లో పెంపుడు కుక్కలా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శ
  • దావణగెరె ఎస్పీ ఉమా ప్రశాంత్ ఫిర్యాదుతో కేసు నమోదు
  • తనకు గౌరవం ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని ఎమ్మెల్యే ఆరోపణ
  • కర్ణాటకలో నేతల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
కర్ణాటకలో ఓ బీజేపీ ఎమ్మెల్యే మహిళా పోలీస్ ఉన్నతాధికారిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దావణగెరె జిల్లా ఎస్పీ ఉమా ప్రశాంత్‌ను ఉద్దేశించి, ఆమె కాంగ్రెస్ నేతల ఇంట్లో ‘పెంపుడు కుక్క’లా వ్యవహరిస్తున్నారంటూ హరిహర బీజేపీ ఎమ్మెల్యే బి.పి. హరీశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్వయంగా ఎస్పీ ఉమా ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం దావణగెరెలోని కేటీజే నగర్ పోలీస్ స్టేషన్‌లో హరీశ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

మంగళవారం దావణగెరెలో రిపోర్టర్స్ గిల్డ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్ మాట్లాడుతూ.. "నేనొక ఎమ్మెల్యేని. కానీ, ఎస్పీ నన్ను ఏదైనా కార్యక్రమంలో చూస్తే ముఖం చిట్లించుకుంటున్నారు. అదే కాంగ్రెస్‌కు చెందిన శమనూరు కుటుంబ సభ్యుల కోసం మాత్రం గేటు వద్ద పడిగాపులు కాస్తున్నారు. అచ్చం వాళ్లింట్లోని పోమరేనియన్ కుక్కలా ఆమె ప్రవర్తన ఉంటోంది" అని తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత శమనూరు శివశంకరప్ప ఎమ్మెల్యేగా ఉండగా, ఆయన కుమారుడు ఎస్.ఎస్. మల్లికార్జున్ రాష్ట్ర మంత్రిగా, కోడలు ప్రభా మల్లికార్జున్ దావణగెరె ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

కొన్ని సంఘటనలను ఉదాహరణగా చూపుతూ, హరిహరలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎస్పీ తనను పట్టించుకోకుండా, అగౌరవంగా వేదికపై కూర్చున్నారని హరీశ్ ఆరోపించారు. "గాంధీ భవన్ వద్ద మండుటెండలో ఎంపీ ప్రభా మల్లికార్జున్ కోసం ఎస్పీ గంటల తరబడి ఎదురుచూశారు. నేనూ ప్రజాప్రతినిధినే, ఆమె కూడా ప్రజాప్రతినిధే. మరి ఈ వివక్ష ఎందుకు?" అని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్నవారి అండ చూసుకుంటే మంచిదని ఎస్పీ భావిస్తున్నారని, కానీ ఇదంతా తాత్కాలికమేనని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా, ఇటీవల మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్.వి. దేశ్‌పాండే సైతం ఓ మహిళా రిపోర్టర్‌తో అనుచితంగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. రాష్ట్రంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మహిళలపై రాజకీయ నాయకులు చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
BJP MLA
Uma Prashanth
Davangere
Karnataka
B P Harish
IPS officer
Congress
Shamnur Shivashankarappa
Political controversy

More Telugu News