Malla Reddy: కేసీఆర్‌కు పార్టీయే ముఖ్యం.. కూతురు కాదు: కవిత సస్పెన్షన్‌పై మల్లారెడ్డి

Malla Reddy Comments on Kavitha Suspension KCR Prioritizes Party
  • కవిత సస్పెన్షన్‌ను సమర్థించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి
  • కేసీఆర్‌కు కుటుంబం కన్నా పార్టీయే ముఖ్యమన్న మాజీ మంత్రి
  • ప్రతి కుటుంబంలో గొడవలు సహజమని వ్యాఖ్య
  • కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని మండిపాటు
  • కేసీఆర్ లాంటి నేత ఉండటం తెలంగాణ అదృష్టమన్న మ‌ల్లారెడ్డి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తన కుమార్తె, కుమారుడి కంటే పార్టీయే ముఖ్యమని, అందుకే పార్టీని ధిక్కరించిన ఎమ్మెల్సీ కవితపై వేటు వేయడం సరైన నిర్ణయమని ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో కేసీఆర్ ఎంత కఠినంగా ఉంటారో ఈ చర్యతో మరోసారి స్పష్టమైందని ఆయన అభిప్రాయపడ్డారు.

బోయిన్‌ప‌ల్లిలోని శ్రీవెంక‌టేశ్వ‌ర లారీ అసోసియేష‌న్ ఆధ్వర్యంలో జరిగిన వినాయక చవితి పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత సస్పెన్షన్‌పై స్పందిస్తూ, "ప్రతి కుటుంబంలో గొడవలు రావడం సహజం. అలాగే దేశంలోని ప్రతి పార్టీలో ఇలాంటి సస్పెన్షన్లు జరుగుతుంటాయి. కేసీఆర్‌కు తెలంగాణ ప్రజల శ్రేయస్సే ముఖ్యం. తన కుటుంబ సభ్యుల కోసం ఆయన పార్టీని నాశనం చేసుకోలేరు" అని అన్నారు.

ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాళేశ్వరం అంశంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కాంగ్రెస్ డ్రామాలకు తెరలేపిందని మండిపడ్డారు. "ఈ విషయంలో సీబీఐ కాదు, ఎవరు వచ్చినా ఏమీ చేయలేరు. కేవలం సీబీఐ పేరు చెప్పి కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని చూడటం సరికాదు. ఆయన లాంటి గొప్ప నాయకుడు తెలంగాణకు దొరకడం మన అదృష్టం" అని మల్లారెడ్డి పేర్కొన్నారు.
Malla Reddy
BRS
KCR
Kavitha
Telangana
Kaleshwaram Project
Telangana Politics
Party Suspension
Indian Politics
BRS Party

More Telugu News