Zomato: పండుగల ముందు ఫుడ్ లవర్స్‌కు షాక్.. ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచిన జొమాటో

Zomato Raises Platform Fee To Rs 12 Ahead Of Festive Rush
  • జొమాటోలో ప్రతీ ఆర్డర్‌పై ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు
  • రూ. 10 నుంచి రూ. 12కి చేరిన చార్జీలు
  • ఇప్పటికే ఫీజును రూ. 14కి పెంచిన స్విగ్గీ
  • క్విక్ కామర్స్‌లో భారీ పెట్టుబడులే కారణం
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేవారికి ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో షాకిచ్చింది. పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో తన ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రతీ ఆర్డర్‌పై రూ. 10 వసూలు చేస్తుండగా, ఇకపై దాన్ని రూ. 12కి పెంచింది. ఈ కొత్త చార్జీలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. రాబోయే పండుగల సమయంలో ఫుడ్ ఆర్డర్లు భారీగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ పెంపు వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపనుంది.

జొమాటో బాటలోనే దాని పోటీ సంస్థ స్విగ్గీ కూడా ఇటీవలే తన ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచింది. ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో జీఎస్టీతో కలిపి ఈ ఫీజును రూ. 12 నుంచి రూ. 14కి పెంచినట్లు తెలిసింది. అయితే, ఆర్డర్ల ఒత్తిడి తగ్గిన తర్వాత ఈ పెంపును వెనక్కి తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్ల‌డించాయి. ప్రస్తుతం ఈ రెండు సంస్థలు క్విక్ కామర్స్ విభాగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ ప్రభావం వాటి ఆర్థిక ఫలితాలపై స్పష్టంగా కనిపిస్తోంది.

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జొమాటో నికర లాభం వార్షిక ప్రాతిపదికన 90 శాతం తగ్గి రూ. 25 కోట్లకు పడిపోయింది. అయితే, సంస్థ ఆదాయం మాత్రం 70 శాతం పెరిగింది. మరోవైపు స్విగ్గీ నష్టాలు రెట్టింపై రూ. 1,197 కోట్లకు చేరాయి. ముఖ్యంగా 'ఇన్‌స్టామార్ట్' వ్యాపారంలో పెట్టుబడులు పెరగడమే స్విగ్గీ నష్టాలకు కారణంగా తెలుస్తోంది.
Zomato
Zomato platform fee
Swiggy
food delivery
online food order
festival season
Instamart
quick commerce

More Telugu News