Arun Rajput: ఇన్‌స్టా పరిచయం... ఫిల్టర్లు వాడి వయసు దాచిన మగువ.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ప్రియురాలి హత్య!

Instagram Romance Ends in Murder in Uttar Pradesh
  • ఇన్‌స్టాగ్రామ్‌లో 52 ఏళ్ల మహిళతో 26 ఏళ్ల యువకుడికి పరిచయం
  • ఫిల్టర్లు వాడి వయసు దాచిపెట్టి యువతిగా నమ్మించిన మహిళ
  • ప్రియుడికి రూ.1.5 లక్షలు ఇచ్చిన బాధితురాలు
  • పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో చున్నీతో ఉరివేసి హత్య
  • నిందితుడు అరుణ్ రాజ్‌పుత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
సోషల్ మీడియాలో ఫిల్టర్లు వాడి తన వయసును దాచిపెట్టి ఓ యువకుడితో ప్రేమాయణం నడిపిన 52 ఏళ్ల మహిళ చివరకు అతడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. ఆగస్టు 11న లభ్యమైన గుర్తుతెలియని మహిళ మృతదేహం కేసును ఛేదించినట్లు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. యూపీలోని మెయిన్‌పురికి చెందిన 26 ఏళ్ల అరుణ్ రాజ్‌పుత్‌కు, ఫరూఖాబాద్ జిల్లాకు చెందిన 52 ఏళ్ల రాణికి మధ్య ఏడాదిన్నర క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. నలుగురు పిల్లల తల్లి అయిన రాణి ఫిల్టర్లు ఉపయోగించి తనను తాను చాలా చిన్న వయసు యువతిగా పరిచయం చేసుకుంది. ఆమె ఫొటోలు చూసి మోసపోయిన అరుణ్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. తర్వాత ప్రత్యక్షంగా కలుసుకుని ఫరూఖాబాద్‌లోని పలు హోటళ్లలో కలుసుకునేవారు. ఈ క్రమంలో రాణి, అరుణ్‌కు సుమారు రూ.1.5 లక్షలు కూడా ఇచ్చింది.

కొంతకాలంగా రాణి తనను పెళ్లి చేసుకోవాలని, ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలని అరుణ్‌పై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టింది. "ఆగస్టు 10న అరుణ్ ఆమెను మెయిన్‌పురికి పిలిచాడు. పెళ్లి, డబ్బు విషయమై వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశానికి లోనైన నిందితుడు, ఆమె చున్నీతోనే గొంతు నులిమి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు" అని నగర పోలీస్ చీఫ్ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు.

మరుసటి రోజు మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు ఆమె వివరాలు తెలియకపోవడంతో దర్యాప్తు ప్రారంభించారు. కాల్ రికార్డులు, సోషల్ మీడియా ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అరుణ్ తన నేరాన్ని అంగీకరించాడు. పెళ్లి చేసుకోకపోతే పోలీసులకు లేదా తన కుటుంబ సభ్యులకు చెబుతానని రాణి బెదిరించడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్టు ఒప్పుకున్నాడు. "వారిద్దరి మధ్య సంభాషణలు, ఫోటోలు ఉన్న రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. నిందితుడిని జైలుకు తరలించాం" అని పోలీసులు వివరించారు.
Arun Rajput
Instagram
murder
Uttar Pradesh
online dating
age filter
crime
Mainpuri
social media
Rani murder case

More Telugu News