Shivani Nagaram: ఈ సినిమాతో ప్రేక్షకులకు పాత రోజులు గుర్తుకు వస్తాయి: లిటిల్ హార్ట్స్ కథానాయకి శివానీ నాగారం

Shivani Nagaram Talks About Little Hearts Movie
  • ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా లిటిల్ హార్ట్స్
  • మీడియా సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్న కథానాయకి శివానీ నాగారం
  • ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని వెల్లడి 
ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే అంశాలున్న సినిమా లిటిల్ హార్ట్స్ అని ఆ సినిమా కథానాయిక శివానీ నాగారం పేర్కొన్నారు. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న శివానీ ఇటీవల ‘లిటిల్‌హార్ట్స్‌’ సినిమాలో నటించారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ పతాకంపై సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఆదిత్య హాసన్ నిర్మాతగా ఈ సినిమా రూపొందగా, బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. లిటిల్ హార్ట్స్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా శివానీ నిన్న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.

తాను మంచి కథ కోసం ఎదురు చూస్తున్న సమయంలో చిన్నప్పటి స్నేహితుడైన సంగీత దర్శకుడు సింజిత్ ఈ సినిమా కథ గురించి చెప్పినపుడు, ఆ తర్వాత దర్శకుడు సాయిమార్తాండ్ ఈ కథ వినిపించినపుడు తనకు కళాశాల రోజులు గుర్తుకువచ్చాయన్నారు. ఇందులోని ప్రతి పాత్రనీ చాలా బాగా డిజైన్ చేశారన్నారు. హాస్యం ప్రధానంగా, సరదా ప్రేమకథతో ఈ సినిమా సాగుతుందన్నారు. తాను కాత్యాయని అనే అమ్మాయిగా కనిపిస్తానని, ఆ పాత్రలో ప్రేక్షకులు తమని తాము చూసుకుంటారని చెప్పారు. తన జీవితానికి దగ్గరైన పాత్ర కావడంతో చాలా సహజంగా నటించానని శివానీ పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరికీ చదువుకునేటప్పుడు చేసిన పనులన్నీ ఈ సినిమాలో కనిపిస్తుంటాయని, దాంతో తాము అప్పట్లో ఇలా ఉండేవాళ్లం కదా అని పాత రోజులను గుర్తు చేసుకుంటారన్నారు. ఇందులోని నటులంతా ఒకే వయసు వాళ్లం కావడంతో స్నేహితుల్లా కలిసిపోయి నటించామని చెప్పుకొచ్చారు. రాజీవ్ కనకాల, అనిత చౌదరి, కాంచి, సత్యకృష్ణన్... వీళ్లంతా తమని ప్రోత్సహిస్తూ తమతో కలిసిపోయారని తెలిపారు. ఈ సినిమాను బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తుండడంతో మరో స్థాయికి వెళ్లిందన్నారు. ఈ సినిమా ఓవర్సీస్‌లోనూ విడుదలవుతోందని శివానీ వెల్లడించారు. 
Shivani Nagaram
Little Hearts Movie
Sai Martand
ETV Win Originals
Bunny Vas
Vamsi Nandipati
Telugu Movie
College Life
Romantic Comedy
Kathyaayani Character

More Telugu News