Revanth Reddy: పక్కకు జరిగితే చాలు.. కుర్చీలో కూర్చుని నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy Remarks on CM Post Succession Spark Debate
  • అనుభవంతో చెబుతున్నానన్న రేవంత్ రెడ్డి
  • హోటల్ దసపల్లాలో 'వైఎస్ఆర్ స్మారక పురస్కారం-2025' ప్రదానోత్సవ కార్యక్రమం
  • వైఎస్ ఆశయాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందన్న రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుర్చీ నుంచి కొంచెం పక్కకు జరిగితే చాలు, ఆ స్థానంలో కూర్చొని నడిపించడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. తాను అనుభవంతో ఇవి చెబుతున్నానని అన్నారు.

మంగళవారం హైదరాబాద్‌లోని హోటల్ దసపల్లాలో నిర్వహించిన 'వైఎస్ఆర్ స్మారక పురస్కారం-2025' ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

వైఎస్ రాజశేఖర రెడ్డి, కేవీపీ మధ్య ఉన్న అనుబంధం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. కొందరు మేం అన్నీ చూసుకుంటామని చెబుతుంటారని, కానీ ఈ తరానికి ఒకే వైఎస్సార్, ఒకే కేవీపీ ఉంటారని రేవంత్ రెడ్డి అన్నారు. మిత్రుడు వైఎస్ కోసం కేవీపీ సర్వం ధారపోశారని అన్నారు.

కేవీపీ ఎప్పుడూ వైఎస్ వెంటే ఉన్నారని అన్నారు. కానీ ఈనాడు చాలామంది కేవీపీ కావాలని అనుకుంటారని, కానీ అలా ఎవరూ కాలేరని అన్నారు. ఒక కేవీపీ కావాలంటే సర్వం త్యాగం చేయగలగాలని ముఖ్యమంత్రి అన్నారు. ఈరోజుల్లో అలాంటి గుణం ఉన్నవారు ఎవరూ లేరని అన్నారు. మొదటి వారం మనం ఎవరినైనా లోపలకు రానిస్తే, రెండో వారంలో కాస్త పక్కకు జరిగితే ఆ కుర్చీలో కూర్చుని నడుపుతానని చెప్పేవారు ఉన్నారని వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని అన్నారు. వైఎస్ఆర్ కలలు కన్న ప్రాజెక్టును పూర్తిచేసి తీరుతామని పునరుద్ఘాటించారు. "తుమ్మిడిహట్టి వద్ద మళ్లీ ప్రాజెక్టును నిర్మించి, రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూర్, కొడంగల్ ప్రాంతాలకు గోదావరి జలాలను తీసుకువస్తాము. ఇది రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కొనసాగించే ప్రభుత్వంగా నేను ఇస్తున్న మాట" అని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమానికి హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా, తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు హాజరయ్యారు. దివంగత నేత వైఎస్ఆర్‌కు నివాళులు అర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు.
Revanth Reddy
Telangana CM
YS Rajasekhara Reddy
YSR Smaraka Puraskaram
Bhupinder Singh Hooda

More Telugu News