Chandrababu Naidu: ఇది రాష్ట్ర భవిష్యత్తును మార్చే మాస్టర్ ప్లాన్: సీఎం చంద్రబాబు

Chandrababu unveils master plan for Andhra Pradesh maritime logistics
  • తూర్పు తీరానికి మారిటైమ్ లాజిస్టిక్స్ గేట్ వేగా ఆంధ్రప్రదేశ్
  • ప్రతి ఓడరేవుకు కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్ రూపకల్పన
  • జల, వాయు, రోడ్డు, రైలు మార్గాలను అనుసంధానించేలా సమీకృత వ్యవస్థ
  • పొరుగు రాష్ట్రాల కార్గో రవాణాను ఆకర్షించడంపై ప్రత్యేక దృష్టి
  • త్వరలో ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్, లాజిస్టిక్స్ యూనివర్సిటీ ఏర్పాటు
  • పోర్టుల వద్ద పారిశ్రామిక క్లస్టర్లు, టౌన్ షిప్ ల నిర్మాణానికి ప్రణాళికలు
ఆంధ్రప్రదేశ్ ను తూర్పు తీరానికి ప్రధాన మారిటైమ్ లాజిస్టిక్స్ గేట్ వేగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఓడరేవును జాతీయ, అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్రంగా మార్చేందుకు వీలుగా జల, వాయు, రోడ్డు, రైలు మార్గాలను అనుసంధానిస్తూ ఒక సమగ్రమైన కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఈ కీలక ప్రణాళికతో ఏపీని దేశంలోనే అగ్రగామి లాజిస్టిక్స్ హబ్ గా నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు.

మంగళవారం నాడు విశాఖపట్నంలో జీఎఫ్ఎస్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్’కు ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు ఉన్న సహజ అనుకూలతలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. "మన రాష్ట్రానికి కేవలం మన అవసరాల కోసమే కాకుండా, ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, కర్ణాటక వంటి భూపరివేష్టిత రాష్ట్రాల కార్గో రవాణాకు కూడా కీలక కేంద్రంగా మారే అపారమైన అవకాశం ఉంది. వారి సరుకును ఏపీ పోర్టుల ద్వారానే ప్రపంచానికి చేరవేసేలా ఒక పటిష్టమైన కార్యాచరణను అమలు చేస్తున్నాం" అని వివరించారు.

సమీకృత రవాణా వ్యవస్థే కీలకం

రాష్ట్రంలో లాజిస్టిక్స్ రంగాన్ని సమూలంగా మార్చేందుకు సమీకృత రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. "ప్రస్తుతం ఉన్న పోర్టులు, కొత్తగా నిర్మించబోయే ఓడరేవులను కలుపుతూ జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, ఎయిర్ కార్గో సదుపాయాలు, అంతర్గత జలమార్గాలను అనుసంధానిస్తాం. దీనికోసం ప్రతి పోర్టుకు ఒక ప్రత్యేక కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్ ఉంటుంది. గోదావరి, కృష్ణా నదుల ద్వారా సుమారు 1,500 కిలోమీటర్ల మేర అంతర్గత జల రవాణాకు అవకాశాలున్నాయి. వీటితో పాటు, ఒకప్పుడు వాణిజ్యానికి జీవనాడిగా ఉన్న బకింగ్ హామ్ కెనాల్ ను పునరుద్ధరించి కాకినాడ-చెన్నై మధ్య జల రవాణాను తిరిగి ప్రారంభిస్తాం. ఈ చర్యలతో రవాణా వ్యయం గణనీయంగా తగ్గుతుంది" అని చంద్రబాబు అన్నారు.

ఈ సదస్సుకు ముందు ముఖ్యమంత్రి, దేశవ్యాప్తంగా వివిధ పోర్టులు, కార్గో కంపెనీలకు చెందిన 62 మంది సీఈఓలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పన, టెర్మినళ్ల ఆధునీకరణ, షిప్ బిల్డింగ్ వంటి అంశాలపై వారితో విస్తృతంగా చర్చించారు. భారీ నౌకలు సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా 18 మీటర్ల లోతైన ఓడరేవులు తూర్పు తీరంలో ఏపీలో మాత్రమే ఉన్నాయని, ఇది మనకు సానుకూల అంశం అని పేర్కొన్నారు.

పోర్టు ఆధారిత అభివృద్ధికి శ్రీకారం

కేవలం రవాణాతోనే ఆగిపోకుండా, పోర్టుల చుట్టూ ఒక పారిశ్రామిక, ఆర్థిక పర్యావరణ వ్యవస్థను నిర్మించనున్నట్లు సీఎం తెలిపారు. "రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ, మూలపేట వంటి పోర్టుల వద్ద పరిశ్రమల ఏర్పాటు, ఆధునిక టౌన్ షిప్ ల నిర్మాణం కోసం దాదాపు 10 వేల ఎకరాల భూమిని సిద్ధం చేస్తున్నాం. ఈ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు త్వరలోనే లాజిస్టిక్స్ యూనివర్సిటీ, సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీలను కూడా ఏర్పాటు చేస్తాం," అని ప్రకటించారు. లాజిస్టిక్స్ కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా ‘ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్’ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

రాష్ట్ర జీఎస్డీపీలో లాజిస్టిక్స్ రంగం వాటాను 3 శాతానికి పెంచే అవకాశం ఉందని, దుగరాజపట్నం వంటి ప్రాంతాల్లో షిప్ బిల్డింగ్, షిప్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని అన్నారు. ఈ రంగానికి మరింత ప్రోత్సాహం అందించేందుకు 15-20 మంది పారిశ్రామికవేత్తలతో ఒక సలహా బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం, మారిటైమ్ రంగంలో ఆవిష్కరణలు చేస్తున్న ఆరు స్టార్టప్ కంపెనీల స్టాళ్లను పరిశీలించి, ఎయిర్ కార్గో ఫోరం ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, డీబీవీ స్వామి, మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Maritime Logistics
East Coast Maritime Logistics Summit
AP Logistics Corporation
Ports Development
Infrastructure Development
Logistics Hub
Connectivity Master Plan
Cargo Transportation

More Telugu News