Central Government: విదేశీయులపై కేంద్రం కఠిన వైఖరి.. నేర చరిత్ర ఉంటే దేశంలోకి నో ఎంట్రీ!

India Bans Entry for Foreigners with Criminal History
  • గతంలో నేరాలకు పాల్పడిన విదేశీయుల రీఎంట్రీపై నిషేధం
  • వారి కోసం ప్రత్యేక నిర్బంధ శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశం
  • సరిహద్దుల్లో అక్రమ వలసదారులను అడ్డుకోవాలని సూచన
  • పాక్, చైనా, అఫ్ఘనిస్థాన్ దేశస్థులకు కొన్ని ప్రాంతాల్లో ప్రవేశం బంద్
  • భారత్‌లో పనిచేసే విదేశీ ఉద్యోగులకు సైతం కొత్త షరతులు
దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో గతంలో నేరాలకు పాల్పడి, దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న విదేశీయులు తిరిగి దేశంలోకి ప్రవేశించకుండా కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

గతంలో భారత్‌కు వచ్చి గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాలు, హత్యలు, అత్యాచారాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడి దోషులుగా తేలిన విదేశీ పౌరులను గుర్తించి, వారిని మళ్లీ దేశంలోకి అడుగుపెట్టనీయకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని హోంశాఖ స్పష్టం చేసింది. ఒకవేళ అలాంటి వారు దేశంలో ఎక్కడైనా కనిపిస్తే తక్షణమే అదుపులోకి తీసుకోవాలని సూచించింది. ఇందుకోసం ఇటీవల అమల్లోకి తెచ్చిన ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ చట్టం (2025) ప్రకారం ప్రత్యేక హోల్డింగ్ సెంటర్లు లేదా నిర్బంధ శిబిరాలను ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

సరిహద్దుల వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేయాలని హోంశాఖ ఆదేశించింది. అక్రమ వలసదారులు దేశంలోకి చొరబడకుండా నిరోధించేందుకు సరిహద్దు రక్షణ దళాలు, కోస్ట్ గార్డులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపింది. మరోవైపు, ఆఫ్ఘనిస్థాన్, చైనా, పాకిస్థాన్‌లలో జన్మించిన వారికి భారత్‌లోని కొన్ని సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించడంపై నిషేధం విధించింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లడఖ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్‌లోని కొన్ని ప్రదేశాలకు వారు వెళ్లకుండా చూడాలని పేర్కొంది.

అంతేకాకుండా, భారత్‌లో ఉద్యోగం చేయడానికి సరైన వీసా ఉన్న విదేశీయులు సైతం స్థానిక అధికారుల అనుమతి లేకుండా విద్యుత్‌, నీరు, పెట్రోలియం వంటి కీలక రంగాల్లోని ప్రైవేటు సంస్థల్లో చేరకూడదని కొత్త షరతు విధించింది. పర్వతారోహణ వంటి కార్యక్రమాలు చేపట్టాలంటే కూడా తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. 
Central Government
India
Foreigners
Crime history
Immigration
National Security
Illegal Immigrants
Border Security
Visa Regulations
Home Ministry

More Telugu News