Varla Ramaiah: చేయని తప్పుకు చంద్రబాబు మూడు దశాబ్దాల నుంచి నిందను మోస్తున్నారు: వర్ల రామయ్య

Varla Ramaiah Slams Jagan Over Chandrababu Backstabbing Allegations
  • చంద్రబాబు వెన్నుపోటుదారుడు కాదు, పార్టీని కాపాడిన ప్రొటెక్టర్ అన్న వర్ల
  • అసలైన వెన్నుపోటు రాజకీయాలు మొదలైందే వైఎస్ కుటుంబం నుంచి అని విమర్శలు
  • తండ్రి, తల్లి, చెల్లి, బాబాయికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్ రెడ్డి అని ఆరోపణ
ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటుదారుడు కాదని, ఆయన పార్టీని, రాష్ట్రాన్ని కాపాడిన నిజమైన 'ప్రొటెక్టర్' అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పష్టం చేశారు. అసలైన వెన్నుపోటు రాజకీయాలకు ఆద్యులు వైఎస్ కుటుంబీకులేనని, వైసీపీ అధినేత జగన్ సిసలైన 'వెన్నుపోటుదారుడు' అని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుపై దశాబ్దాలుగా చేస్తున్న వెన్నుపోటు ఆరోపణలపై ఎవరైనా తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మంగళవారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ, "జగన్ గారు గోబెల్స్ ప్రచారంలో ఆరితేరిపోయారు. లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు చూపించడంలో హిట్లర్ ప్రచార మంత్రి గోబెల్స్‌ను కూడా ఆయన దాటిపోయారు. ఎంతో సహనశీలి అయిన చంద్రబాబు, తాను చేయని తప్పుకు మూడు దశాబ్దాలుగా వెన్నుపోటు అనే నిందను మోస్తున్నారు. ఆయన వెన్నుపోటుదారుడు కాదు, ఒక రక్షకుడు" అని అన్నారు.

1995 నాటి ఆగస్టు సంక్షోభాన్ని గుర్తుచేస్తూ, "పేదవాడికి కూడు, గూడు, నీడ అందించాలన్న ఎన్టీఆర్ ఆశయాలతో పుట్టిన పార్టీ టీడీపీ. ఆనాడు పార్టీని, ఎన్టీఆర్‌ను ఒక దుష్టశక్తి కబళించాలని చూసినప్పుడు, దాని కబంధ హస్తాల నుంచి పార్టీని కాపాడిన మహాశక్తి చంద్రబాబు. అంతకుముందు కాంగ్రెస్ కోవర్టుల వల్ల ఎన్టీఆర్ సీఎం పదవి కోల్పోతే, దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి 30 రోజుల్లోనే ఆయన్ను తిరిగి ముఖ్యమంత్రిని చేసిన ప్రొటెక్టర్ కూడా చంద్రబాబే. ఆనాడు ఆయన తీసుకున్న సాహసోపేత నిర్ణయానికి ప్రజలు 1999 ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు. ఒకవేళ చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టకపోయి ఉంటే, ఈరోజు సైబరాబాద్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు వంటివి ఉండేవా? హైదరాబాద్‌లో ఐటీ విప్లవం సాధ్యమయ్యేదా?" అని ఆయన ప్రశ్నించారు.

వెన్నుపోటు చరిత్ర వైఎస్ కుటుంబంతోనే మొదలైందని వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. "బతుకుదెరువు కోసం వచ్చిన జగన్ తాత రాజారెడ్డికి, బైరటీస్ గనిలో వాటా ఇచ్చి ఆశ్రయం కల్పించిన బీసీ నేత జింకా వెంకట నర్సయ్యను వెన్నుపోటు పొడిచి ఆ గనిని మొత్తం లాక్కున్నది నిజం కాదా? ఆ రక్తపు కూడుతోనే మీ కుటుంబం కోట్లకు పడగలెత్తింది. ఇక, తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొడుకుతో రూ. 43 వేల కోట్లు అక్రమంగా సంపాదించేలా చేసి, ప్రజలను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన బతికి ఉంటే, జగన్‌పై ఉన్న కేసుల్లో ఏ1గా వైఎస్ఆర్, ఏ2గా జగన్ ఉండేవారు" అని ఆరోపించారు.

జగన్ తన సొంత కుటుంబ సభ్యులకే వెన్నుపోటు పొడిచారని రామయ్య విమర్శించారు. "తండ్రి శవం ఇంటికి రాకముందే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించి కన్నతండ్రికే వెన్నుపోటు పొడిచారు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని తల్లిని, చెల్లిని దూరం పెట్టింది నిజం కాదా? ఎత్తుకొని పెంచిన సొంత బాబాయి వివేకానంద రెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేయించి, ఇప్పుడు నిందితులను కాపాడుతూ ఆయన కుమార్తె సునీతకు అన్యాయం చేస్తున్నది ఎవరు? ఇవన్నీ వెన్నుపోట్లు కావా?" అని నిలదీశారు. నవరత్నాల పేరుతో ప్రజలను, నాసిరకం మద్యంతో వారి ఆరోగ్యాన్ని దెబ్బతీసి రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేశారని మండిపడ్డారు. ఈ అంశాలపై చర్చించేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, రోజా కానీ బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.
Varla Ramaiah
Chandrababu Naidu
TDP
YS Jagan
CBN
Andhra Pradesh Politics
NTR
Backstabbing Politics
Telugu Desam Party
YS Rajasekhara Reddy

More Telugu News