Mithun Reddy: మిథున్ రెడ్డి బయటకు వచ్చాక కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తారు: పేర్ని నాని

Mithun Reddy Will Expose Coalition Government Says Perni Nani
  • రాజమండ్రి జైల్లో ఎంపీ మిథున్ రెడ్డితో మాజీ మంత్రి పేర్ని నాని ములాఖత్
  • అక్రమ కేసులో ఇరికించి అరెస్ట్ చేశారని ప్రభుత్వంపై నాని విమర్శ
  • పెద్దిరెడ్డి కుటుంబాన్ని మానసికంగా దెబ్బతీసే కుట్ర అని ఆరోపణ
లిక్కర్ స్కామ్ కేసులో రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని కలిశారు. ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి 40 రోజులు గడుస్తున్నా, ఇంతవరకు ఒక్కరోజు కూడా ఎందుకు కస్టడీకి తీసుకోలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు.

కేవలం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మానసికంగా కుంగదీయాలనే దురుద్దేశంతోనే మిథున్ రెడ్డిపై అక్రమ కేసు బనాయించి జైల్లో పెట్టారని పేర్ని నాని ఆరోపించారు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో సహ నిందితులు చెప్పిన మాటల ఆధారంగా ఒక ఎంపీని అరెస్ట్ చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్యేనని ఆయన మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా, జైల్లో ఉన్నంత మాత్రాన మిథున్ రెడ్డి ధైర్యం కోల్పోరని స్పష్టం చేశారు.

త్వరలోనే ఆయన బయటకు వస్తారని, ఆ తర్వాత కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా చుక్కలు చూపిస్తారని పేర్ని నాని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న పాపాలపై మిథున్ రెడ్డి ఎదురుదాడి చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు దాఖలు చేసిన పలు పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. మిథున్ రెడ్డి పిటిషన్‌తో పాటు, జైల్లో ఆయనకు కల్పిస్తున్న సౌకర్యాలపై జైళ్ల శాఖ వేసిన రివ్యూ పిటిషన్‌పైనా రేపు విచారణ జరిపి ఆదేశాలు ఇస్తామని న్యాయస్థానం తెలిపింది. ఇదే కేసులో ఇతర నిందితులైన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్పల డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ల విచారణ కూడా రేపు వాయిదా పడింది. 
Mithun Reddy
YS Jagan Mohan Reddy
Rajampet MP
AP Liquor Scam
YSRCP
Perni Nani
Andhra Pradesh Politics
Chandrababu Naidu
TDP
Peddireddy Ramachandra Reddy

More Telugu News