Kieron Pollard: కీర‌న్ పొలార్డ్ విధ్వంసం.. 8 బంతుల్లో 7 సిక్స‌ర్లు.. ఇదిగో వీడియో!

Kieron Pollard Smashes 7 Sixes in 8 Balls in CPL 2025
  • కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో కీర‌న్ పొలార్డ్ విధ్వంసం
  • 8 బంతుల వ్యవధిలో ఏకంగా 7 సిక్సర్లు.. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ 
  • కేవలం 29 బంతుల్లో 65 పరుగుల మెరుపు ఇన్నింగ్స్
  • ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు 12 పరుగుల తేడాతో విజయం
  • ‘ప్లేయ‌ర్‌ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన పొలార్డ్
కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2025 సీజన్‌లో వెస్టిండీస్ మాజీ కెప్టెన్, విధ్వంసకర ఆల్‌రౌండర్ కీర‌న్ పొలార్డ్ తనదైన శైలిలో బ్యాటింగ్ సునామీ సృష్టించాడు. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (టీకేఆర్) తరఫున ఆడుతూ, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 8 బంతుల వ్యవధిలో ఏకంగా 7 భారీ సిక్సర్లు బాది బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో టీకేఆర్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన 38 ఏళ్ల పొలార్డ్, కేవలం 29 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 21 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేసిన నవియాన్ బిదైసీ బౌలింగ్‌లో చివరి నాలుగు బంతుల్లో మూడు సిక్సర్లు కొట్టిన కీర‌న్ పొలార్డ్, ఆ తర్వాత వకార్ సలామ్‌ఖైల్ వేసిన 16వ ఓవర్‌లో వరుసగా నాలుగు బంతులను స్టాండ్స్‌లోకి పంపాడు. దీంతో అత‌ని పవర్‌ఫుల్ హిట్టింగ్‌కు మైదానం దద్దరిల్లింది. నికోలస్ పూరన్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 90 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

పొలార్డ్ మెరుపులతో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ జట్టు 180 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో ఆండ్రీ ఫ్లెచర్ 54 బంతుల్లో 67 పరుగులు చేసి పోరాడినా, పేట్రియాట్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులకే పరిమితమైంది. అద్భుత ప్రదర్శన చేసిన కీర‌న్ పొలార్డ్‌కు ‘ప్లేయ‌ర్‌ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.

మ్యాచ్ అనంతరం పొలార్డ్ మాట్లాడుతూ.. "ఇదేమీ నా కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్ అని చెప్పలేను. నేను 20 ఏళ్లుగా ఆడుతున్నాను. ప్రస్తుతం క్రికెట్‌ను ఆస్వాదిస్తూ, అభిమానులకు, కుటుంబ సభ్యులకు సంతోషాన్ని పంచడానికే ప్రయత్నిస్తున్నాను. ఆట పరిస్థితిని బట్టి, బౌలర్లను అంచనా వేసి ఆడతాను. ఇది ఒక చెస్ గేమ్ లాంటిది. కోచ్‌గా కూడా వ్యవహరిస్తున్నందున, యువ ఆటగాళ్లకు ఎలా ఆడాలో స్వయంగా చూపించాల్సి ఉంటుంది. నా ఆటను నేను అర్థం చేసుకుని ఆడతాను తప్ప, ప్రత్యర్థిని బట్టి కాదు" అని తెలిపాడు. ఇటీవలే పొలార్డ్ టీ20 క్రికెట్‌లో 14,000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా నిలిచిన విషయం తెలిసిందే.
Kieron Pollard
CPL 2025
Caribbean Premier League
Trinbago Knight Riders
St Kitts and Nevis Patriots
Andre Fletcher
Nicholas Pooran
West Indies Cricket
T20 Cricket

More Telugu News