Kalvakuntla Kavitha: హరీశ్‌రావుపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. కవితపై సస్పెన్షన్ వేటుకు సిద్ధమైన బీఆర్ఎస్!

Kalvakuntla Kavitha Suspension Likely From BRS After Remarks on Harish Rao
  • కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్‌లో కలకలం
  • ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ అత్యవసర భేటీ
  • కవితను సస్పెండ్ చేయాలని అధినేతకు నేతల సూచన
  • ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం
  • సోషల్ మీడియాలో కవితను అన్‌ఫాలో అవుతున్న శ్రేణులు
  • సొంత పార్టీ పెట్టే యోచనలో కవిత ఉన్నట్టు ప్రచారం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆ పార్టీ అధిష్ఠానం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సొంత పార్టీ సీనియర్ నేతలైన హరీశ్‌రావు, సంతోష్ కుమార్‌లపై ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన అధినేత కేసీఆర్ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసే దిశగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయంపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడవచ్చని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

కవిత మీడియా సమావేశం అనంతరం కేసీఆర్ తన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో కేటీఆర్‌తో పాటు పలువురు సీనియర్లు కూడా పాల్గొన్నారు. కవితను పార్టీలో కొనసాగిస్తే ప్రతిపక్షాలకు ఆయుధమిచ్చినట్టే అవుతుందని, ఇది పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని మెజారిటీ నేతలు కేసీఆర్‌కు వివరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆమెపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవని వారు అభిప్రాయపడినట్టు తెలిసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ యంత్రాంగం ఇప్పటికే కవితను దూరం పెట్టే చర్యలు ప్రారంభించింది. సోషల్ మీడియాలో ఆమెను అన్‌ఫాలో కావాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. పలువురు నేతలు టీవీ చర్చల్లో ఆమె వైఖరిని బహిరంగంగానే తప్పుబడుతున్నారు. కొందరైతే ఆమె వెంటనే పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, హరీశ్‌రావుకు మద్దతుగా బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం పోస్టులు పెట్టడం గమనార్హం.

ఒకవేళ బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ వేటు పడితే కవిత భవిష్యత్ కార్యాచరణ ఏంటనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆమె సొంతంగా పార్టీ పెట్టే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కొంతకాలంగా 'తెలంగాణ జాగృతి' సంస్థను బలోపేతం చేస్తున్న ఆమె అదే పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించవచ్చని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పార్టీ పెడితే తెలంగాణ జాగృతినే పార్టీ పేరుగా ఖరారు చేసే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు అంటున్నారు.
Kalvakuntla Kavitha
BRS
Harish Rao
KTR
Telangana Jagruthi
Telangana Politics
BRS Suspension
KCR
Telangana
Political News

More Telugu News