Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ పనైపోయింది: కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy Comments on BRS Party Situation
  • కేసీఆర్ కుటుంబ కలహాలలో తాము తలదూర్చమన్న మంత్రి కోమటిరెడ్డి 
  • కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరు అవినీతికి పాల్పడ్డారో సీబీఐ విచారణలో తేలుతుందన్న మంత్రి కోమటిరెడ్డి
  • మరో 15 ఏళ్లు కాంగ్రెస్ అధికారం ఖాయమన్న మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ ఆ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పని అయిపోయినట్లేనని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి కోమటిరెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు భగ్గుమంటున్నాయన్నారు. 

కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే హరీశ్ రావు ఊరుకోరని, ఆయన స్వతంత్ర పార్టీ పెట్టుకునే పరిస్థితి ఉందని వినిపిస్తున్నదన్నారు. ఇటీవల కొందరు నేతలు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన నేపథ్యంలో కవిత అంశంపై తర్వాత ఆలోచిద్దామని కేసీఆర్ చెప్పి పంపినట్లు తెలుస్తోందన్నారు. 

కేసీఆర్ కుటుంబ కలహాల్లో తాము తలదూర్చమని స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి పై అసభ్య వ్యాఖ్యలు చేస్తే ప్రతిస్పందిస్తామని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగినట్లు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో స్పష్టమైందన్నారు. దీనిపై విచారణ జరిపించాలని సీబీఐకి అప్పగించామని, ఎవరు అవినీతి చేశారో సీబీఐ విచారణలో బహిర్గతమవుతుందని పేర్కొన్నారు. 
 
రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని, మరో 15 సంవత్సరాలు ఆధిపత్యం కొనసాగుతుందని మంత్రి కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Komatireddy Venkat Reddy
BRS party
Kalvakuntla Kavitha
Harish Rao
Telangana politics
KCR
Revanth Reddy
Kaleshwaram project corruption

More Telugu News