Piyush Goyal: యూఏఈతో బంధం మరింత బలోపేతం.. చమురేతర వాణిజ్యంపై కీలక నిర్ణయం

Piyush Goyal Discusses Strengthening India and UAE Trade Relations
  • భారత్-యూఏఈ మధ్య చమురేతర వాణిజ్యంపై ప్రత్యేక దృష్టి
  • 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల వాణిజ్యమే లక్ష్యం
  • భారత ఫార్మా, ఆహార రంగాల సమస్యల పరిష్కారానికి యూఏఈ హామీ
  • యూఏఈలో 'భారత్ మార్ట్' ఏర్పాటుకు ప్రణాళికల రూపకల్పన
  • రూపాయి-దిర్హామ్‌లో వాణిజ్య లావాదేవీలను ప్రోత్సహించాలని నిర్ణయం
  • పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ రంగాల్లో సహకారానికి అంగీకారం
భారత్, యూఏఈ ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని (సెపా) సమీక్షించిన అనంతరం, 2030 నాటికి చమురేతర ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చాలని సమున్నత లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. మారుతున్న ప్రపంచ వాణిజ్య పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

గత వారం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, యూఏఈ విదేశీ వాణిజ్య మంత్రి థానీ బిన్ అహ్మద్ అల్ జెయౌదీ మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీ వివరాలను కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. 'సెపా' ఒప్పందం కింద సాధించిన ప్రగతిని మంత్రులిద్దరూ సమీక్షించారు. భవిష్యత్తులో పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, సరఫరా గొలుసు, ఆరోగ్య సంరక్షణ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో కలిసి పనిచేయాలని అంగీకారానికి వచ్చారు.

వాణిజ్యాన్ని మరింత సులభతరం చేసేందుకు స్థానిక కరెన్సీ సెటిల్‌మెంట్ సిస్టమ్ (రూపాయి-దిర్హామ్), యూఏఈలో 'భారత్ మార్ట్' ఏర్పాటు వంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఇరు దేశాల మంత్రులు అభిప్రాయపడ్డారు. వాణిజ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకోవడం ద్వారా 'సెపా' పర్యవేక్షణను మెరుగుపరచాలని నిర్ణయించారు. భారత ఫార్మా కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు యూఏఈలో కొత్తగా ఏర్పాటైన 'ఎమిరేట్స్ డ్రగ్ ఎస్టాబ్లిష్‌మెంట్' కీలక పాత్ర పోషిస్తుందని భారత ప్రతినిధి బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.

ఈ సమావేశంలో భాగంగా ఫార్మా, ఆహార రంగాల ప్రతినిధులతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. భారత ఫార్మా ఉత్పత్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలను వేగవంతం చేస్తామని యూఏఈ మంత్రి హామీ ఇచ్చారు. అలాగే, ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్య రంగంలో సహకారానికి అవకాశాలున్నాయని చర్చించారు. ఆహార రంగంలో, భారత ఫుడ్, అగ్రిటెక్ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు అపెడా 'భారతీ స్కీమ్'ను ప్రారంభించింది. దీంతో పాటు 2026లో దుబాయ్‌లో జరిగే 'గల్ఫ్ ఫుడ్' ప్రదర్శనలో భారత్‌ను భాగస్వామ్య దేశంగా గుర్తించేందుకు ఒప్పందం కుదిరింది. భారత ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా త్వరగా పరిష్కరిస్తామని యూఏఈ భరోసా ఇచ్చింది.
Piyush Goyal
India UAE trade
India UAE relations
UAE foreign trade
Rupee Dirham trade
India Mart UAE

More Telugu News