Kavitha: హరీశ్ రావు, సంతోష్ నాపై కుట్రలు చేశారు: కవిత సంచలన ఆరోపణలు

Kavitha Alleges Revanth Reddy Behind Harish Rao Santosh Kumar Conspiracy
  • వారిద్దరు తనపై ఎన్నో కుట్రలు చేశారన్న కవిత
  • రేవంత్‌తో వారికి లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపణ
  • కేసీఆర్‌కు అంటిన మరక వెనుక హరీశ్ రావు లేరా? అని ప్రశ్న
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ తనపై ఎన్నో కుట్రలు చేశారని, అయినప్పటికీ తాను నోరు మెదపలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హరీశ్ రావు, సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. వారి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆమె అన్నారు. అందుకే రేవంత్ రెడ్డి వారిద్దరిని ఏమీ అనడం లేదని అన్నారు.

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కాళేశ్వరంలో చిన్నభాగం కుంగితే మొత్తం ప్రాజెక్టు పోయిందని రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి కేసీఆర్ పక్కనున్న కొందరు చేసిన పని వల్లే ఆయనకు చెడ్డపేరు వచ్చిందని, అందులో ఐదేళ్ల పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రావు పాత్ర లేదా? అని ప్రశ్నించారు. సంతోష్, హరీశ్ రావు, మేఘా ఇంజినీరింగ్ వల్లే కేసీఆర్‌కు చెడ్డపేరు వచ్చిందని ఆమె అన్నారు.

ఈరోజు కేసీఆర్ బిడ్డగా నేను ఎంతో బాధపడుతున్నానని అన్నారు. కేసీఆర్ మీద సీబీఐ దర్యాప్తు వేశాక పార్టీ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది తన తండ్రి పరువుకు సంబంధించిన విషయమని ఆమె అన్నారు. తన లేఖ గతంలో బయటకు వచ్చినప్పటికీ తాను ఎవరి పేర్లనూ బయటపెట్టలేదని తెలిపారు. కేసీఆర్ జనం కోసం పనిచేస్తే అవతలి వాళ్లు ఆస్తుల పెంపు కోసం పనిచేశారని ఆరోపించారు.

కేసీఆర్ హిమాలయ పర్వతం లాంటి వారని కవిత అన్నారు. నాకు పెళ్లి చేసేందుకు కూడా మా నాన్న ఇబ్బంది పడ్డారు... అలాంటి దేవుడి లాంటి వ్యక్తిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడం బాధగా ఉందని అన్నారు. కేసీఆర్‌ను నిన్న అన్ని మాటలు అంటుంటే ఒక్కరు కూడా నోరు విప్పకపోవడం ఏమిటని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై బిల్లు పెడతారు కానీ సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. బీహార్ కోసం తెలంగాణ బీసీ బిడ్డలను బలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ కాదు.. ఇంకే విచారణ జరిపినా కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Kavitha
Kalvakuntla Kavitha
Harish Rao
Santosh Kumar
Revanth Reddy
KCR

More Telugu News