Nadendla Manohar: దివ్యాంగుల పెన్షన్ ను రూ.15 వేలు పెంచిన ఘనత మా ప్రభుత్వానిదే: మంత్రి నాదెండ్ల మనోహర్

Nadendla Manohar AP Govt Increased Disability Pension to 15000
  • రాష్ట్రవ్యాప్తంగా మొదలైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
  • తెనాలిలో ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు నగదు అందజేసిన మంత్రి నాదెండ్ల
  • మొత్తం 63.61 లక్షల మందికి రూ. 2746 కోట్లు విడుదల
  • పారదర్శకత కోసమే ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్నామన్న మంత్రి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా ఎన్టీఆర్ భరోసా పేరిట పెన్షన్ల పంపిణీ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ (సెప్టెంబరు 1) రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. సెప్టెంబర్ నెల కోటా కింద రాష్ట్రవ్యాప్తంగా 63,61,380 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం రూ. 2,746.52 కోట్లను విడుదల చేసింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మంత్రి నాదెండ్ల మనోహర్, గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని జాగర్లమూడి గ్రామంలోని సుల్తానాబాద్‌ కాలనీల్లో పర్యటించి, లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, పంపిణీ ప్రక్రియలో పూర్తి పారదర్శకత తీసుకువచ్చేందుకే లబ్ధిదారుల ఇంటి వద్దకే నేరుగా పెన్షన్ మొత్తాన్ని అందిస్తున్నామని తెలిపారు. కేవలం తెనాలి నియోజకవర్గంలోనే 35,563 మందికి రూ. 14.99 కోట్లను పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సాధారణ పెన్షన్‌ను రూ. 2,000 నుంచి రూ. 4,000కు, దివ్యాంగుల పెన్షన్‌ను అర్హతను బట్టి రూ. 6 వేలు, రూ. 10 వేలు, రూ. 15 వేలకు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు.

వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు వంటి నిస్సహాయ వర్గాలను ఆదుకోవడమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే సామాజిక భద్రతా పెన్షన్లకు అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వితంతువులకు కూడా త్వరలోనే పెన్షన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

స్థానిక అభివృద్ధికి హామీ

ఈ పర్యటనలో భాగంగా మంత్రి నాదెండ్ల మనోహర్ పలు స్థానిక అభివృద్ధి పనులపై హామీ ఇచ్చారు. జాగర్లమూడిలో సదరం క్యాంపు ఏర్పాటు చేస్తామని, పాఠశాల భవనం, పంచాయతీ కార్యాలయం, రహదారుల నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. ఈ నెలలో 'స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం నిర్వహిస్తామని, సైడ్ కాలువల ఆధునీకరణ, రక్షిత మంచినీటి సరఫరా వంటి పనులు పూర్తి చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఇంటి వద్దకే రేషన్ పంపిణీ, త్వరలో స్మార్ట్ రేషన్ కార్డుల జారీ వంటి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ఈ ప్రాంతంలో నిమ్మ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
Nadendla Manohar
Andhra Pradesh
Pension Scheme
NTR Bharosa
Disability Pension
Tenali
Jaggarlamudi
AP Government
Social Security
Pension Distribution

More Telugu News