Bandi Sanjay: కాళేశ్వరంపై మా పోరాటం ఫలించింది... బీఆర్ఎస్ బాధ్యత వహించాల్సిందే: కేంద్ర మంత్రి బండి సంజయ్

Bandi Sanjay Our Fight on Kaleshwaram Succeeded BRS Must Take Responsibility
  • కాళేశ్వరంపై బీజేపీ వైఖరే సరైందని రుజువైందన్న బండి సంజయ్
  • బీఆర్ఎస్‌ను కాపాడేందుకే కాంగ్రెస్ చర్యలు ఆలస్యం చేసిందని ఆరోపణ
  • వెంటనే సీబీఐ విచారణకు లేఖ పంపాలని ప్రభుత్వానికి సూచన
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై తమ పార్టీ బీజేపీ మొదటి నుంచి అనుసరిస్తున్న వైఖరే సరైందని మరోసారి స్పష్టమైందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు బీఆర్ఎస్ పూర్తి బాధ్యత వహించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.

ఈ అంశంపై ఈరోజు ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం అవినీతిపై తాము మొదటి నుంచి సీబీఐ విచారణ కోరుతున్నామని గుర్తుచేశారు. అయితే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్‌ను కాపాడే ఉద్దేశంతోనే ఇన్నాళ్లూ చర్యలు తీసుకోవడంలో జాప్యం చేసిందని ఆరోపించారు. "ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నిజానికి తలవంచి, ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు అంగీకరించింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సీబీఐకి లేఖ పంపాలి" అని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ తీరును విమర్శిస్తూ, గతంలో ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) టోల్ టెండర్ల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం సిట్‌ను ప్రకటించిందని, కానీ నేటికీ అది కార్యరూపం దాల్చలేదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఒక డైలీ సీరియల్‌లా కొనసాగుతోందని ఆయన విమర్శించారు. కాళేశ్వరం విషయంలో ఇంత జరిగాక, బీఆర్ఎస్ నైతిక బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. 
Bandi Sanjay
Kaleshwaram Project
BRS
Corruption
CBI Investigation
Telangana
Outer Ring Road
Phone Tapping Case
Congress Government

More Telugu News