Indian Women: ఖర్చు లక్షల్లో ఉన్నా తగ్గేదేలే.. విదేశీ ఎంబీఏలపై మన అమ్మాయిల ఆసక్తి

More Indian women pursuing MBAs abroad says Report
  • ప్రపంచవ్యాప్తంగా ఎంబీఏ కోర్సుల్లో 42 శాతానికి చేరిన మహిళల సంఖ్య 
  • ఒక దశాబ్దం క్రితం ఇది కేవలం 28 శాతంగా ఉండేది
  • 2024లో రికార్డు స్థాయిలో 6,100 మందికి పైగా భార‌త‌ మహిళల అడ్మిషన్లు
  • గ్లోబల్ కెరీర్, లీడర్‌షిప్ అవకాశాల కోసమే ఈ ఆసక్తి
  • లక్షల్లో ఫీజులు ఉన్నా విద్యా రుణాలతో ముందుకు
ఉన్నత విద్యలో భారతీయ మహిళలు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ఎంబీఏ వంటి మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఒకప్పుడు అరుదుగా కనిపించే ఈ రంగంలో ఇప్పుడు మన అమ్మాయిలు సత్తా చాటుతున్నారు. గ్లోబల్ స్టూడెంట్ లోన్ ప్రొవైడర్ అయిన ప్రాడిజీ ఫైనాన్స్ సోమవారం విడుదల చేసిన నివేదిక ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

పదేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా ఎంబీఏ కోర్సుల్లో మహిళల వాటా కేవలం 28 శాతంగా ఉండగా, ఇప్పుడు అది 42 శాతానికి చేరినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా 2024 సంవత్సరంలో ప్రపంచంలోని ప్రముఖ యూనివర్సిటీల్లో 6,100 మందికి పైగా భారతీయ మహిళలు ఫుల్-టైమ్ ఎంబీఏ ప్రోగ్రాముల్లో చేరారు. ఇది ఇప్పటివరకూ నమోదైన అత్యధిక సంఖ్య కావడం గమనార్హం. కేవలం అకడమిక్ ప్రతిభ మాత్రమే కాకుండా, గ్లోబల్ లీడర్‌షిప్ పాత్రలు, ఉన్నత ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవాలనే వారి ఆశయానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.

అమెరికాలోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌కు గతేడాదితో పోలిస్తే ఎంబీఏ దరఖాస్తులు 21 శాతం పెరిగాయి. అలాగే జర్మనీలో భారతీయ విద్యార్థుల సంఖ్య 2023-24 వింటర్ సెమిస్టర్ నాటికి 49,483కి చేరిందని, ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 15.1 శాతం అధికమని జర్మన్ అకడమిక్ ఎక్స్ఛేంజ్ సర్వీస్ (డీఏఏడీ) గణాంకాలు చెబుతున్నాయి.

ఈ మార్పుపై ప్రాడిజీ ఫైనాన్స్ గ్లోబల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సోనాల్ కపూర్ మాట్లాడుతూ.. "చిన్న పట్టణాల నుంచి కూడా మహిళలు విదేశాల్లోని టాప్ ఎంబీఏ ప్రోగ్రాముల్లో చేరుతున్నారు. ఆశయానికి హద్దులుండవని, వారు సంపాదించిన నైపుణ్యం తిరిగి దేశానికి ఉపయోగపడుతుందని నిరూపిస్తున్నారు" అని తెలిపారు.

 విదేశీ ఎంబీఏ చదువుకు సుమారు రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఖర్చవుతున్నప్పటికీ, విద్యా రుణాలు, కొత్త ఫైనాన్సింగ్ పద్ధతులు అందుబాటులోకి రావడంతో ఇది సాధ్యమవుతోందని నివేదిక పేర్కొంది. విద్య జీవితాలను మార్చే శక్తి అని, మహిళల విద్యకు మద్దతు ఇవ్వడం ద్వారా వ్యాపార ప్రపంచంలో వారు బలమైన ముద్ర వేయడానికి తాము సహకరిస్తున్నామని సోనాల్ కపూర్ వివరించారు.
Indian Women
MBA
MBA abroad
Prodigy Finance
Global Education
study abroad
MBA programs
women in business
international universities
Sonal Kapoor
higher education

More Telugu News