Yadagirigutta Temple: యాదగిరిగుట్టకు అంతర్జాతీయ ఖ్యాతి.. స్వామివారి సేవలను ప్రశంసించిన కెనడా ప్రధాని

Canada PM Mark Carney Appreciates Yadagirigutta Temple Services
  • ఆలయ సేవలను ప్రశంసిస్తూ కెనడా ప్రధాని మార్క్ కార్నీ లేఖ
  • ఒట్టావాలో స్వామివారి కల్యాణోత్సవం నిర్వహణపై అభినందనలు
  • కెనడా సమాజానికి హిందూ సమాజం చేస్తున్న సేవలను కొనియాడిన ప్రధాని
  • ఇది గొప్ప గౌరవమంటూ మంత్రి కొండా సురేఖ, ఆల‌య ఈఓ హర్షం
  • కెనడాలోని నాలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న స్వామివారి కల్యాణాలు
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కీర్తి విశ్వవ్యాప్తమైంది. ఆలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవలకు కెనడా ప్రధాని మార్క్ కార్నీ నుంచి ప్రశంసలు అందడం అరుదైన గౌరవంగా నిలిచింది. కెనడా రాజధాని ఒట్టావాలోని ఈవై సెంటర్‌లో ఇటీవల నిర్వహించిన యాదాద్రి స్వామివారి కల్యాణ మహోత్సవంపై ఆయన అభినందనలు తెలుపుతూ ఆలయ నిర్వాహకులకు ప్రత్యేకంగా ఒక లేఖ పంపారు.

ఈ లేఖలో హిందూ సంస్కృతిలోని ఆధ్యాత్మికతను, ఐక్యతా భావాన్ని మార్క్ కార్నీ ప్రత్యేకంగా కొనియాడారు. పవిత్ర సంప్రదాయాలను కొనసాగించేందుకు, సమాజ విలువలను గౌరవించేందుకు స్వామివారి కల్యాణం ఒక చక్కని అవకాశమని అభివర్ణించారు. ఒట్టావాలో భక్తులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఆలయ నిర్వాహకులు, సమన్వయకర్తలు చూపిన చొరవను ఆయన ప్రశంసించారు. అంతేకాకుండా కెనడా సమాజాన్ని మరింత సుసంపన్నం చేయడంలో హిందూ సమాజం పోషిస్తున్న పాత్రను అభినందించారు.

కెనడా ప్రధాని నుంచి అభినందన లేఖ రావడంపై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆలయ ఈఓ వెంకట్రావు హర్షం వ్యక్తం చేశారు. ఇది యాదగిరిగుట్ట దేవస్థానానికి దక్కిన గొప్ప గౌరవంగా వారు పేర్కొన్నారు. స్వామివారి సేవలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 27వ తేదీ వరకు కెనడాలోని నాలుగు రాష్ట్రాల్లో స్వామివారి కల్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను విస్తృతంగా కొనసాగిస్తామని వారు వెల్లడించారు.
Yadagirigutta Temple
Mark Carney
Canada Prime Minister
Lakshmi Narasimha Swamy Temple
Hindu culture
Konda Surekha
ottava
Hindu Society

More Telugu News