LPG Gas Cylinder: వాణిజ్య సిలిండర్ ధర తగ్గింపు.. గృహ వినియోగదారులకు నిరాశ

Commercial LPG cylinders price reduced by Rs 5150 effective Sep 1
  • 19 కేజీల సిలిండర్‌పై రూ. 51.50 కోత
  • సెప్టెంబర్ 1 నుంచి కొత్త ధరలు అమలు
  • గృహ వినియోగ సిలిండర్ ధరలో మార్పు లేదు
  • ఉజ్వల లబ్ధిదారులకు రూ. 300 సబ్సిడీ కొనసాగింపు
వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీలు) మరోసారి తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ. 51.50 మేర కోత విధిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ కొత్త ధరలు ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయ‌ని చమురు కంపెనీలు ప్ర‌క‌టించాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,580కి చేరింది.

నెలవారీ సమీక్షలో భాగంగా చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ ధరల తగ్గింపు హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలకు పెద్ద ఊరట కలిగించనుంది. గత కొన్ని నెలలుగా కమర్షియల్ సిలిండర్ ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. జులై 1న రూ. 58.50, ఆగస్టులో రూ. 33.50 చొప్పున ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. అంతకుముందు జూన్‌లో కూడా సిలిండర్‌పై రూ. 24 తగ్గించారు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, ఇతర మార్కెట్ అంశాల ఆధారంగా ప్రతి నెలా ఈ ధరలను సవరిస్తుంటారు.

అయితే, 14.2 కిలోల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి వినియోగదారులకు నిరాశే ఎదురైంది.

మరోవైపు, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 14.2 కిలోల సిలిండర్‌పై రూ. 300 సబ్సిడీని కొనసాగించాలని ఇటీవల కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులు ఏడాదికి 9 రీఫిళ్ల వరకు ఈ రాయితీని పొందవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 12,000 కోట్లు ఖర్చు చేయనుంది. దేశవ్యాప్తంగా 2025 జులై 1 నాటికి సుమారు 10.33 కోట్ల ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయి.
LPG Gas Cylinder
Commercial Cylinder Price
Gas Price Cut
Oil Marketing Companies
PMUY Scheme
Ujjwala Yojana
Domestic Gas Cylinder Price
Gas Subsidy

More Telugu News