US Travel: అమెరికా ప్రయాణాలు తగ్గాయి: ఎన్టీటీవో

Indian Travel to US Drops After Two Decades
  • ఈ ఏడాది జూన్‌లో 8 శాతం మేర పడిపోయిన సందర్శకుల సంఖ్య
  • కొనసాగుతున్న తగ్గుదల.. జులైలోనూ 5.5 శాతం క్షీణత
  • విద్యార్థుల ప్రయాణాలపై ప్రభావమే ప్రధాన కారణమని అంచనా
  • ఇది ప్రపంచవ్యాప్త ధోరణి అంటున్న అమెరికా ప్రభుత్వ నివేదిక
గత రెండు దశాబ్దాలుగా ఏటా పెరుగుతూ వస్తున్న అమెరికా ప్రయాణాల సంఖ్యకు ఈసారి బ్రేక్ పడింది. సుమారు 24 ఏళ్లలో (కరోనా మహమ్మారి సంవత్సరాలు మినహా) తొలిసారిగా, అమెరికాను సందర్శించే భారతీయుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. ఈ క్షీణత కేవలం భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదని, ఇది ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న ధోరణి అని నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం ఆఫీస్ (ఎన్టీటీవో) నివేదిక స్పష్టం చేస్తోంది. అమెరికాకు వచ్చే మొత్తం అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య కూడా జూన్‌లో 6.2 శాతం, మే నెలలో 7 శాతం, మార్చిలో 8 శాతం మేర తగ్గింది.

అమెరికా వాణిజ్య శాఖకు చెందిన ఎన్టీటీవో విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఈ ఏడాది జూన్ నెలలో 2.1 లక్షల మంది భారతీయులు అమెరికాలో పర్యటించారు. గతేడాది ఇదే సమయానికి ఈ సంఖ్య 2.3 లక్షలుగా ఉండగా, ఈసారి ఏకంగా 8 శాతం క్షీణత కనిపించింది. ఈ తగ్గుదల ధోరణి జులైలో కూడా కొనసాగినట్లు ప్రాథమిక సమాచారం సూచిస్తోంది. జులై నెలలో గతేడాదితో పోలిస్తే 5.5 శాతం తక్కువ మంది ప్రయాణించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అమెరికాకు అత్యధికంగా సందర్శకులను పంపే దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. అమెరికాతో భూ సరిహద్దులు పంచుకునే కెనడా, మెక్సికోలను పక్కన పెడితే, సముద్రం దాటి వచ్చే ప్రయాణికుల్లో యూకే తర్వాత భారత్ రెండో అతిపెద్ద మార్కెట్‌గా కొనసాగుతోంది. 

సాధారణంగా మన దేశం నుంచి విద్యార్థులు, వ్యాపారవేత్తలు, బంధువులు, స్నేహితులను కలిసేందుకే ఎక్కువ మంది అమెరికాకు వెళుతుంటారు. అయితే, ఈసారి ముఖ్యంగా విద్యార్థుల సంఖ్యలో తగ్గుదల ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీసా జారీ ప్రక్రియలో జాప్యం, ఇతర పరిమితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వ్యాపార, కుటుంబ పర్యటనలపై కూడా ప్రభావం పడొచ్చని వారు అంచనా వేస్తున్నారు.
US Travel
Indian Tourists
America Travel
Travel Trends
US Visa
International Travel
Student Visas
Tourism Statistics

More Telugu News