Sreesanth: పాత వివాదంపై కొత్త దుమారం.. శ్రీశాంత్ భార్య, లలిత్ మోదీ మధ్య మాటల యుద్ధం

Lalit Modi Responds to Sreesanths Wife Bhuvneshwaris Criticism
  • లలిత్ మోదీపై శ్రీశాంత్ భార్య భువనేశ్వరి ఫైర్
  • చౌకబారు ప్రచారం కోసమేనని తీవ్ర విమర్శ
  • విమర్శలకు స్పందించిన మాజీ ఐపీఎల్ కమిషనర్
  • నన్ను అడిగారు, నిజం చెప్పానన్న లలిత్ మోదీ
  • శ్రీశాంత్ బాధితుడు మాత్రమేనని వ్యాఖ్య
ఐపీఎల్ ‘స్లాప్-గేట్’ పాత వివాదానికి సంబంధించిన వీడియోను విడుదల చేయడంపై టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ భార్య భువనేశ్వరి చేసిన తీవ్ర విమర్శలకు ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ బదులిచ్చారు. తాను కేవలం నిజం మాత్రమే చెప్పానని, అందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "ఆమె (భువనేశ్వరి) ఎందుకు కోపంగా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. నన్ను ఒక ప్రశ్న అడిగారు, నేను దానికి నిజాయతీగా సమాధానం చెప్పాను. నేను నిజం మాట్లాడతానని అందరికీ తెలుసు. ఆ ఘటనలో శ్రీశాంత్ బాధితుడు, నేను చెప్పింది కూడా అదే" అని మోదీ వివరించారు.

ఇటీవల మైఖేల్ క్లార్క్‌తో కలిసి ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న లలిత్ మోదీ 2008 ఐపీఎల్ సీజన్‌కు సంబంధించిన పాత విషయాలను చర్చిస్తూ హర్భజన్ సింగ్.. శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టిన వీడియోను బయటపెట్టారు. అప్పట్లో బ్రాడ్‌కాస్టర్లు తమ కెమెరాలను ఆపేసిన తర్వాత తన సెక్యూరిటీ కెమెరాలో ఈ దృశ్యం రికార్డ్ అయిందని ఆయన తెలిపారు. ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్ అనంతరం కరచాలనం చేసుకునే సమయంలో ఈ ఘటన జరిగింది.

ఈ వీడియో విడుదలపై శ్రీశాంత్ భార్య భువనేశ్వరి సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "లలిత్ మోదీ, మైఖేల్ క్లార్క్‌కు ఇది సిగ్గుచేటు. కేవలం మీ చౌకబారు ప్రచారం, వ్యూస్ కోసం 2008 నాటి విషయాన్ని మళ్లీ బయటకు లాగడం అమానుషం. హర్భజన్, శ్రీశాంత్ ఇద్దరూ ఆ ఘటనను మరిచిపోయి జీవితంలో ముందుకు సాగారు. వాళ్లకు ఇప్పుడు స్కూల్‌కు వెళ్లే పిల్లలున్నారు. అలాంటిది మీరు పాత గాయాన్ని మళ్లీ రేపుతున్నారు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వివాదాన్ని మళ్లీ తెరపైకి తేవడం వల్ల తమ కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురవుతోందని ఆమె అన్నారు. "18 ఏళ్ల క్రితం ముగిసిపోయిన విషయాన్ని ఇప్పుడు చూడాల్సి రావడం చాలా బాధగా ఉంది. దీనివల్ల అమాయకులైన మా పిల్లలు సమాజంలో అవమానకరమైన ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి దేవుడికి భయపడండి" అని భువనేశ్వరి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా, తన భార్య చేసిన పోస్టులను శ్రీశాంత్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. 2008లో జరిగిన ఈ ఘటన తర్వాత హర్భజన్ సింగ్‌పై 11 మ్యాచ్‌ల నిషేధం విధించారు. అయితే, ఆ తర్వాత ఇద్దరు క్రికెటర్లు రాజీపడి, పలు సందర్భాల్లో కలిసి వ్యాఖ్యానం కూడా చేశారు.
Sreesanth
Lalit Modi
Bhuvneshwari Sreesanth
Harbhajan Singh
IPL slapgate
Michael Clarke
Indian Cricket
Mumbai Indians
Kings XI Punjab
IPL Controversy

More Telugu News