RTC: బస్సు నడుపుతూ ఫోన్ మాట్లాడుతున్నారా?.. ఇక కుదరదు!

TGRTC to Ban Cell Phones While Driving Buses
  • విధుల్లో ఆర్టీసీ డ్రైవర్ల సెల్‌ఫోన్ వాడకంపై టీజీఆర్టీసీ నిషేధం
  • ప్రయాణికుల రోడ్డు భద్రత కోసమే ఈ కీలక నిర్ణయం
  • సెప్టెంబర్ 1 నుంచి నెల రోజుల పాటు పైలట్ ప్రాజెక్టు
  • మొత్తం 11 డిపోల్లో కొత్త నిబంధన అమలు
  • డిపోలోని లాకర్లలో ఫోన్లు భద్రపరచనున్న డ్రైవర్లు
  • అత్యవసర సమాచారం కండక్టర్ ద్వారా చేరవేత
ప్రయాణికుల భద్రతను మరింత పటిష్ఠం చేసే దిశగా ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సు నడుపుతున్న సమయంలో డ్రైవర్లు సెల్‌ఫోన్లు వినియోగించడాన్ని పూర్తిగా నిషేధించాలని నిర్ణయించింది. రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనను సెప్టెంబర్ 1 నుంచి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనుంది.

విధుల్లో ఉన్నప్పుడు కొందరు డ్రైవర్లు సెల్‌ఫోన్లు వాడుతున్నట్లు ఆర్టీసీ విజిలెన్స్ విభాగం జరిపిన తనిఖీల్లో వెల్లడైంది. ఇది ప్రయాణికుల భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని భావించిన యాజమాన్యం, ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. తొలిదశలో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు ఎంపిక చేసిన 11 డిపోల పరిధిలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. గ్రేటర్ జోన్‌లోని ఫరూఖ్‌నగర్, కూకట్‌పల్లి డిపోలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

ఈ కొత్త నిబంధన ప్రకారం డ్రైవర్లు విధులకు హాజరైన వెంటనే తమ సెల్‌ఫోన్లను డిపోలో ఏర్పాటు చేసిన ప్రత్యేక లాకర్లలో భద్రపరచాల్సి ఉంటుంది. డ్యూటీ పూర్తయిన తర్వాతే వారు తమ ఫోన్లను తిరిగి తీసుకోవాలి. ఒకవేళ డ్రైవర్లకు ఏదైనా అత్యవసర సమాచారం అందించాల్సి వస్తే వారి కుటుంబ సభ్యులు లేదా అధికారులు సంబంధిత బస్సు కండక్టర్‌ను సంప్రదించవచ్చు. కండక్టర్ ద్వారా ఆ సమాచారాన్ని డ్రైవర్‌కు చేరవేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు ఫలితాలను బట్టి, భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలలోనూ ఈ విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలించనున్నారు.
RTC
RTC drivers
bus drivers
cell phone ban
road safety
Telangana RTC
bus accidents
Farooqnagar depot
Kukatpally depot
pilot project

More Telugu News