Balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారం అందుకున్న బాలయ్య... హాజరైన బండి సంజయ్, నారా లోకేశ్

Balakrishna Receives World Book of Records Award
  • భారత సినీ చరిత్రలో బాలయ్య సరికొత్త రికార్డ్
  • వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
  • 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గాను దక్కిన ప్రతిష్ఠాత్మక అవార్డు
ప్రముఖ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ తన సినీ జీవితంలో ఒక అరుదైన మైలురాయిని అందుకున్నారు. ఆయన ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (గోల్డ్ ఎడిషన్)లో స్థానం సంపాదించారు. భారత చలన చిత్ర పరిశ్రమ నుంచి ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడిగా ఆయన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 50 ఏళ్లుగా చిత్ర పరిశ్రమకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా బాలకృష్ణకు ఈ గౌరవం దక్కింది.

హైదరాబాద్‌లో వైభవంగా జరిగిన ఒక కార్యక్రమంలో బాలకృష్ణ ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి చేతుల మీదుగా బాలకృష్ణ ఈ అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురిపించారు. "ఒక చరిత్ర రాయాలన్నా, దాన్ని తిరిగి రాయాలన్నా అది ఒక్క బాలయ్య బాబుతోనే సాధ్యం. ఆయన అందరికీ బాలయ్య అయితే, నాకు మాత్రం ముద్దుల మావయ్య" అని అన్నారు. 50 ఏళ్లుగా సినిమా, రాజకీయ రంగాలలో ఆయన తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని లోకేశ్ కొనియాడారు.

బాలకృష్ణ ఎప్పుడూ యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉంటారని, ఆయన సినీ ప్రస్థానంలో చారిత్రక, జానపద, ఆధ్యాత్మికం, సైన్స్ ఫిక్షన్ వంటి ఎన్నో విభిన్న జానర్లలో నటించి మెప్పించారని గుర్తుచేశారు. "బాలయ్య బాబుది భోళాశంకరుడి మనస్తత్వం, అందుకే సినీ పరిశ్రమ ఆయన్ను అంతగా ప్రేమిస్తుంది. బసవతారకం ఆసుపత్రి ఆయనలోని మానవత్వానికి నిదర్శనం. ఓటీటీలో కూడా 'అన్‌స్టాపబుల్' అంటూ అద్భుతంగా రాణించారు. ఆయనకు ఈ పురస్కారం రావడం తెలుగు జాతికి గర్వకారణం" అని లోకేశ్ పేర్కొన్నారు. 
Balakrishna
World Book of Records
Bandi Sanjay
Nara Lokesh
Telugu cinema
Tollywood
Unstoppable
Basavatarakam Hospital
Indian film industry
Gold Edition

More Telugu News