Revanth Reddy: అధికారం నుంచి దించడానికి కమ్యూనిస్టులు ఉపయోగపడతారు: రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Revanth Reddy Comments on Communists Role in Government Change
  • సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు హాజరైన ముఖ్యమంత్రి
  • మొన్న ప్రభుత్వం దిగిపోవడంలో కమ్యూనిస్టుల పాత్ర ఉందన్న రేవంత్ రెడ్డి
  • అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టులు పెద్దగా సహకరించరని వ్యాఖ్య
ప్రభుత్వాలు దిగిపోవడానికి కమ్యూనిస్టులు బాగా ఉపయోగపడతారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్ర భారతిలో జరిగిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఏ ప్రభుత్వం దిగిపోయినా, ఆ ప్రభుత్వం పోవడానికి కమ్యూనిస్టు సోదరులే కారణమని నేను బలంగా నమ్ముతున్నాను. గత ప్రభుత్వం దిగిపోవడంలో వారి పాత్ర ఎంతో ఉంది" అని అన్నారు.

అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టులు పెద్దగా సహకరించకపోయినా, అధికారం నుంచి దించడానికి మాత్రం పూర్తిగా సహకరిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. మొన్న జరిగిన అధికార మార్పిడిలో కూడా, అధికారంలో ఉన్న వ్యక్తిని (కేసీఆర్‌ను ఉద్దేశించి) దించడానికి కమ్యూనిస్టు సోదరులు సంపూర్ణంగా సహకరించారని ఆయన పేర్కొన్నారు.

సురవరం సుధాకర్ రెడ్డి గురించి మాట్లాడుతూ, ఆయన తన సిద్ధాంతాలను చివరి వరకు ఆచరించిన అవిశ్రాంత యోధుడని కొనియాడారు. సమాజంలోని దురాచరాలను రూపుమాపేందుకు ఆయన ఎన్నో చైతన్య కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. మొదటి తరంలో సురవరం ప్రతాప్ రెడ్డి, బూర్గుల రామకృష్ణరావు పాలమురు జిల్లాకు గొప్ప పేరు తెచ్చారని, రెండో తరంలో జైపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి వంటి వారు రాజకీయాల్లో రాణించారని అన్నారు.

రాజకీయం అంటేనే అధికారం అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉంటాం కానీ ప్రతిపక్షంలో ఉండలేమన్నట్లుగా కొందరు ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. కానీ కమ్యూనిస్టులు మాత్రం ఎన్ని సంవత్సరాలైనా ప్రతిపక్షంలో ఉండేందుకు ఇష్టపడతారని అన్నారు. ప్రజల తరఫున మాట్లాడటం, పోరాడటం ఒక గొప్ప బాధ్యత అని ఆయన అన్నారు.
Revanth Reddy
Telangana
Communists
Suravaram Sudhakar Reddy
KCR
Telangana Politics
Indian Politics

More Telugu News