Ambati Rambabu: కుప్పానికి నీళ్లిచ్చింది జగన్... చంద్రబాబు క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్నారు: అంబటి రాంబాబు

Chandrababu Trying to Take Credit for Jagans Work in Kuppam Says Ambati Rambabu
  • పోలవరం పనుల్లో తీవ్ర లోపాలున్నాయన్న అంబటి
  • డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి చంద్రబాబే కారణమని ఆరోపణ
  • కమీషన్ల కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నారని విమర్శ
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సక్రమంగా జరగడం లేదని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు గత, ప్రస్తుత విధానాలే కారణమని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

గతంలో చంద్రబాబు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్లే పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని అంబటి ఆరోపించారు. అంతర్జాతీయ నిపుణులు సైతం ఆయన చేసిన పనులకు తలలు పట్టుకున్నారని అన్నారు. “నిబంధనల ప్రకారం డయాఫ్రం వాల్ 1.5 మీటర్ల వెడల్పుతో, రాతి పొర తగిలేంత లోతు వరకు నిర్మించాలి. కానీ గతంలో కేవలం 0.9 మీటర్ల వెడల్పుతోనే కమీషన్ల కోసం కక్కుర్తిపడి నాసిరకంగా కట్టారు” అని ఆయన విమర్శించారు. ఇప్పుడు కూడా పనులు సరైన పద్ధతిలో జరగడం లేదని దుయ్యబట్టారు.

కుప్పం నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చింది జగన్ అయితే, ఇప్పుడు చంద్రబాబు ఆ ఘనతను తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అంబటి విమర్శించారు. “1989 నుంచి కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకు ఎప్పుడూ అక్కడికి నీళ్లు ఇవ్వాలనే ఆలోచన రాలేదు. 2024 ఫిబ్రవరిలో జగన్ నీళ్లు ఇస్తే, ఇప్పుడు లైనింగ్ పనుల పేరుతో సీఎం రమేష్ కంపెనీకి డబ్బులు కట్టబెడుతున్నారు” అని ఆయన ఆరోపించారు. ఒకరు చేసిన పనికి మరొకరు పేరు తెచ్చుకోవడంలో చంద్రబాబు ఆరితేరారని ఎద్దేవా చేశారు.

మంత్రి రామానాయుడిపైనా అంబటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ‘రామా నాయుడా లేక డ్రామా నాయుడా?’ అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుపై వాస్తవాలు మాట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇది సవాలు కాదని, చర్చకు రావాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నట్లు అంబటి రాంబాబు పేర్కొన్నారు. 
Ambati Rambabu
Polavaram project
Chandrababu Naidu
Kuppam
Jagan
YSRCP
AP politics
Rama Naidu
Andhra Pradesh
Diaphragm wall

More Telugu News