Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి హత్య కుట్ర ఓ పెద్ద నాటకం.. వీడియోలో ఉన్నది వాళ్ల మనుషులే: కాకాణి గోవర్ధన్ రెడ్డి

Kotamreddy Sridhar Reddy Murder Plot a Drama Says Kakani
  • రౌడీషీటర్ కు పెరోల్ ఇప్పించే విషయంలో కోటంరెడ్డి అడ్డంగా బుక్కయ్యారన్న కాకాణి
  • పెరోల్ వివాదం నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ డ్రామా అని విమర్శ
  • దమ్ముంటే హత్య కుట్రపై సీబీఐ విచారణ జరిపించాలని సవాల్
టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఓ వీడియో వైరల్ కావడంపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. అదంతా కోటంరెడ్డి ఆడుతున్న పెద్ద నాటకమని, నాటకాలు ఆడటంలో ఆయనకు నంబర్ వన్ ర్యాంక్ ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. ఒక రౌడీషీటర్‌కు పెరోల్ ఇప్పించే విషయంలో అడ్డంగా దొరికిపోయినందునే, ఆ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ కొత్త డ్రామాకు తెరలేపారని ఆయన ఆరోపించారు.

రౌడీ గ్యాంగ్‌లను పెంచి పోషించిందే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాదా? అని కాకాణి ప్రశ్నించారు. రౌడీషీటర్‌ శ్రీకాంత్‌కు పెరోల్‌ ఇచ్చే విషయంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఎవరి ప్రలోభాలకు లొంగి సంతకం పెట్టారు? అని నిలదీశారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న వ్యక్తులంతా ఎమ్మెల్యే కోటంరెడ్డి, మరో టీడీపీ నేత రూప్‌కు సంబంధించిన మనుషులేనని ఆరోపించారు. ఈ వ్యవహారంలో వైసీపీ ప్రమేయం ఉందని టీడీపీ నేతలు సిగ్గుమాలిన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

గతంలో ఓ ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి, ఇలాంటి డ్రామాలే ఆడితే నాటి ముఖ్యమంత్రి జగన్ అరెస్ట్ చేయించారని కాకాణి గుర్తుచేశారు. తప్పులు చేసేది టీడీపీ నేతలైతే, కేసులు మాత్రం తమ పార్టీ నేతలపై పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రౌడీషీటర్ పెరోల్ వ్యవహారంపైనా, ఈ హత్య కుట్ర ఆరోపణలపైనా సీబీఐ విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు. టీడీపీలో ఏమైనా ఆధిపత్య పోరు ఉంటే దానిని తమపైకి నెట్టవద్దని హితవు పలికారు. 
Kotamreddy Sridhar Reddy
Kakani Govardhan Reddy
Andhra Pradesh Politics
TDP
YSRCP
Rowdy sheeter
Murder plot
Vangalapudi Anitha
Perole
Political Drama

More Telugu News