JC Prabhakar Reddy: తాడిపత్రికి వెళ్లనున్న పెద్దారెడ్డి: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

JC Prabhakar Reddy Comments on Pedda Reddys Tadipatri Visit
  • తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు అనుమతి
  • పెద్దారెడ్డిని అడ్డుకుంటున్నది బాధితులేనని వ్యాఖ్య
  • గతంలో పెద్దారెడ్డి దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపణ
తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రిలోకి ప్రవేశించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంపై టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పెద్దారెడ్డి రాకను తాను అడ్డుకోవడం లేదని, ఆయన వల్ల నష్టపోయిన బాధితులే వ్యతిరేకిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దారెడ్డి అధికారాన్ని అడ్డంపెట్టుకుని అనేక దౌర్జన్యాలకు, అక్రమాలకు పాల్పడ్డారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. "మహిళలని కూడా చూడకుండా టీడీపీకి చెందిన మహిళా కౌన్సిలర్లను వెంటాడి మరీ కొట్టిన చరిత్ర పెద్దారెడ్డిది. పోలీసుల అండతో ఎంతోమంది టీడీపీ కార్యకర్తలపై పీడీ యాక్టు కింద అక్రమ కేసులు బనాయించి, జిల్లా నుంచి బహిష్కరించారు" అని ఆయన విమర్శించారు. గతంలో టీడీపీ నేత పొట్టి రవికి రాష్ట్రపతి నుంచి అనుమతి ఉన్నప్పటికీ తాడిపత్రిలోకి అడుగుపెట్టనివ్వలేదని జేసీ గుర్తుచేశారు. తాడిపత్రిలో రాజకీయాలు చేసే నైతిక అర్హత పెద్దారెడ్డి కుటుంబానికి లేదని ఆయన అన్నారు.

మరోవైపు, తాడిపత్రిలోకి ప్రవేశించకుండా తనపై ఉన్న ఆంక్షలను సవాలు చేస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం, ఆయన తాడిపత్రి వెళ్లేందుకు శుక్రవారం అనుమతి ఇచ్చింది. పెద్దారెడ్డిని ఎవరూ ఆపలేరని స్పష్టం చేసిన కోర్టు, అవసరమైతే ప్రైవేట్ భద్రతను ఏర్పాటు చేసుకోవచ్చని సూచించింది. ఆయనకు తగిన భద్రత కల్పించాలని స్థానిక పోలీసులను ఆదేశించింది.

సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, త్వరలోనే తాడిపత్రికి వెళతానని తెలిపారు. కోర్టు తీర్పు కాపీలను ఎస్పీకి అందజేసి, నిబంధనల మేరకు పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాలతో తాడిపత్రిలో రాజకీయ వాతావరణం ఉత్కంఠగా మారింది.
JC Prabhakar Reddy
Tadipatri
Ketireddy Pedda Reddy
Andhra Pradesh Politics
TDP
YCP
Supreme Court
Political Conflict
AP Politics
Tadipatri Politics

More Telugu News