Bagu Khan: నియంత్రణ రేఖ వద్ద కాల్పులు.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, 'హ్యూమన్ జీపీఎస్' హతం

Bagu Khan Most Wanted Terrorist Killed at LoC
  • జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలకు కీలక విజయం
  • గురెజ్ సెక్టార్‌లో హిజ్బుల్ టెర్రరిస్ట్ బాగూఖాన్ హతం
  • 'హ్యూమన్ జీపీఎస్'గా పేరుగాంచిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది
  • 25 ఏళ్లుగా 100కి పైగా చొరబాట్లలో కీలక పాత్ర
  • చొరబాటు యత్నాన్ని అడ్డుకున్న సైన్యం, పోలీసులు
  • ఎన్‌కౌంటర్‌లో బాగూ ఖాన్‌తో పాటు మరో ఉగ్రవాది కూడా మృతి
జమ్ముకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక కీలక ఉగ్రవాది హతమయ్యాడు. హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, 'హ్యూమన్ జీపీఎస్'గా పేరుగాంచిన బాగూఖాన్‌ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. బందిపొరా జిల్లాలోని గురెజ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో బాగూఖాన్‌తో పాటు మరో ఉగ్రవాది కూడా హతమయ్యాడు.

1995 నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో తలదాచుకుంటున్న బాగూఖాన్, గత 25 ఏళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నాడు. సరిహద్దుల గుండా ఉగ్రవాదులను భారత్‌లోకి పంపడంలో ఇతను కీలక పాత్ర పోషించాడు. గురెజ్ సెక్టార్‌లోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 100కి పైగా చొరబాటు యత్నాలకు సహకరించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

ఎలాంటి కఠిన మార్గాల్లోనైనా ఉగ్రమూకలు భారత్‌లోకి చొరబడేందుకు ఇతడు సహాయం చేసేవాడని, అందులో ఎక్కువ భాగం విజయవంతమయ్యాయని పేర్కొన్నాయి. ముప్పై ఏళ్ల నుంచి పీవోకేలో నివసిస్తూ, ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు మార్గనిర్దేశం చేసేవాడు. దారిలోని ప్రతీ అంగుళం తెలిసినవాడు కావడంతో అతడిని 'హ్యూమన్ జీపీఎస్' అని పిలుస్తారు.

నౌషెరా ప్రాంతం నుంచి ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు అందిన పక్కా నిఘా సమాచారంతో భారత సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు భారత సైన్యం 'ఎక్స్' ద్వారా వెల్లడించింది. సంఘటనా స్థలం నుంచి ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. బాగూఖాన్‌తో పాటు చనిపోయిన మరో ఉగ్రవాదిని ఇంకా గుర్తించాల్సి ఉంది.

ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత, జమ్ముకశ్మీర్‌లో ఇప్పటివరకు ఏడు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మొత్తం 23 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో 12 మంది పాకిస్థానీయులు కాగా, 9 మంది స్థానిక ఉగ్రవాదులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Bagu Khan
Hizbul Mujahideen
Jammu Kashmir
LoC
terrorist
Naushera sector
Gurez sector

More Telugu News