Komatireddy Raj Gopal Reddy: ఈరోజు తర్వాత అసెంబ్లీకి రాను: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Raj Gopal Reddy No More Assembly Attendance After Today
  • వరద బాధితులకు అండగా ఉండేందుకే ఈ నిర్ణయమన్న కోమటిరెడ్డి
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని వెల్లడి
  • కొంత కాలంగా ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాబోనని సంచలన ప్రకటన చేశారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా, గన్ పార్క్ వద్దకు తన మద్దతుదారులతో చేరుకున్న రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అమరవీరుల స్థూపం తమకు గుడితో సమానమని, అక్కడికి రావడానికి ప్రత్యేక కారణాలు అవసరం లేదని అన్నారు. ఈ రోజు తర్వాత తాను మళ్లీ శాసనసభకు రాబోనని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో, ముఖ్యంగా కామారెడ్డి ప్రాంతంలో ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమయంలో వారికి అండగా నిలవడమే తన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. తన అనుచరులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితులకు భరోసా కల్పిస్తానని తెలిపారు.

అయితే, రాజగోపాల్ రెడ్డి నిర్ణయం వెనుక వేరే కారణాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తనకు మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తితో పాటు, తన నియోజకవర్గమైన మునుగోడుకు నిధులు కేటాయించడం లేదని ఆయన గత కొంతకాలంగా బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇటీవల రీజనల్ రింగ్ రోడ్డు రైతుల సమస్యపై కూడా ఆయన ప్రభుత్వానికి భిన్నమైన వైఖరి తీసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా తాను ప్రజల పక్షానే ఉంటానని ఆయన చెబుతూ వస్తున్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చిస్తున్న కీలక సమయంలో రాజగోపాల్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన తాజా వ్యూహం ఏంటనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Komatireddy Raj Gopal Reddy
Telangana politics
Telangana Congress
Munugodu constituency
Assembly sessions
Kaleshwaram project
Regional Ring Road
Telangana floods
Telangana government
MLA

More Telugu News