Gudivada Amarnath: రుషికొండ భవనాల కోసం చంద్రబాబు, పవన్, లోకేశ్ మధ్య పోటీ: గుడివాడ అమర్నాథ్

Chandrababu Pawan Lokesh Competing for Rushikonda Buildings Alleges Gudivada Amarnath
  • సమస్యలను పక్కదారి పట్టించేందుకు రుషికొండ అంశాన్ని తెరపైకి తెచ్చారన్న అమర్నాథ్
  • పవన్, నాదెండ్ల మనోహర్ రుషికొండ వద్ద ఫొటో షూట్ నిర్వహించారని విమర్శ
  • విశాఖ స్టీల్ ప్లాంట్ పై పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్న
విశాఖలోని రుషికొండపై నిర్మించిన భవనాలను ఎవరు వాడుకోవాలనే దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొందని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. రాష్ట్రంలో అసలు సమస్యలను పక్కదారి పట్టించేందుకే కూటమి ప్రభుత్వం రుషికొండ అంశాన్ని తెరపైకి తెచ్చిందని, పవన్ కల్యాణ్ అక్కడ పర్యటించడం కేవలం ఓ డ్రామా అని ఆయన విమర్శించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన అమర్నాథ్, కూటమి నేతల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఎన్నికల సమయంలో రుషికొండ భవనాలను ‘జగన్ ప్యాలెస్’ అంటూ దుష్ప్రచారం చేసిన కూటమి నేతలు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక విడుదల చేసిన జీవోలో ‘పర్యాటక రిసార్ట్’ అని ఎందుకు పేర్కొన్నారని అమర్నాథ్ ప్రశ్నించారు. "ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికే పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ రుషికొండ వద్ద ఫోటో షూట్ నిర్వహించారు. భవనం సీలింగ్‌ను కత్తిరించి, ఆ ప్రాంతంలో ఫొటోలు తీసుకున్నారు" అని ఆయన ఎద్దేవా చేశారు. చిన్నపాటి వర్షానికే కారిపోతున్న అమరావతిలోని తాత్కాలిక సచివాలయం దుస్థితి పవన్‌కు కనిపించడం లేదా? అని నిలదీశారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అమర్నాథ్ మండిపడ్డారు. "విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మాట్లాడిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇప్పుడు కర్మాగారాన్ని అమ్మేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? వేలాది మంది కార్మికులు రోడ్డున పడితే వారి గురించి పట్టించుకోవడం లేదు" అని దుయ్యబట్టారు. కేవలం ఈవెంట్ల కోసం విశాఖను, పేమెంట్ల కోసం అమరావతిని వాడుకుంటున్నారని ఆరోపించారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని అమర్నాథ్ స్పష్టం చేశారు. జగన్ వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని కేంద్ర మంత్రి చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ప్రజల సమస్యలను గాలికొదిలేసిందని విమర్శించారు. త్వరలోనే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తమ పార్టీ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తుందని ఆయన తెలిపారు. 
Gudivada Amarnath
Rushikonda
Chandrababu Naidu
Pawan Kalyan
Nara Lokesh
Visakha Steel Plant Privatization
Andhra Pradesh Politics
TDP
Jagan Mohan Reddy
YSRCP

More Telugu News