Gurpreet Singh: అమెరికాలో పోలీసుల కాల్పుల్లో సిక్కు వ్యక్తి మృతి

Sikh Man Gurpreet Singh Dies After Police Shooting in Los Angeles
  • అమెరికాలో పోలీసుల కాల్పుల్లో 36 ఏళ్ల సిక్కు వ్యక్తి మృతి
  • సంప్రదాయ యుద్ధ విద్య 'గట్కా' ప్రదర్శిస్తుండగా ఘటన
  • కత్తితో ప్రజలను భయపెట్టాడని పోలీసులకు ఫిర్యాదులు
  • ఆదేశాలు పాటించకుండా దాడికి యత్నించాడని పోలీసుల ఆరోపణ
  • ఘటనపై కొనసాగుతున్న ఉన్నత స్థాయి దర్యాప్తు
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కాల్పుల్లో భారత సంతతికి చెందిన 36 ఏళ్ల సిక్కు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సిక్కుల సంప్రదాయ యుద్ధ విద్య అయిన 'గట్కా'ను రోడ్డుపై ప్రదర్శిస్తుండగా ఈ విషాద ఘటన జరిగింది. మృతుడిని గురుప్రీత్ సింగ్‌గా గుర్తించారు.

వివరాల్లోకి వెళితే, జూలై 13న లాస్ ఏంజెలెస్ నగరంలోని ఫిగరోవా స్ట్రీట్, ఒలింపిక్ బౌలేవార్డ్ కూడలిలో ఒక వ్యక్తి పెద్ద కత్తితో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని పోలీసులకు పలుమార్లు 911కు ఫోన్ కాల్స్ అందాయి. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గురుప్రీత్ సింగ్‌ను గుర్తించారు. తన వాహనాన్ని రోడ్డు మధ్యలోనే వదిలేసిన అతను, చేతిలో కత్తితో వింతగా ప్రవర్తించాడని లాస్ ఏంజెలెస్ పోలీస్ విభాగం (ఎల్‌ఏపీడీ) విడుదల చేసిన ఫుటేజీలో రికార్డయింది.

ఆయుధాన్ని కింద పడేయాలని పోలీసులు పలుమార్లు హెచ్చరించినా గురుప్రీత్ సింగ్ పట్టించుకోలేదని అధికారులు తెలిపారు. అంతటితో ఆగకుండా, పోలీసులపైకి ఒక బాటిల్ విసిరి, అక్కడి నుంచి కారులో వేగంగా పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతడిని వెంబడించగా, కొంత దూరం వెళ్ళాక గురుప్రీత్ కారు మరో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టి ఆగింది. అనంతరం కారులోంచి దిగి, చేతిలోని కత్తితో పోలీసులపైకి దూసుకెళ్లాడని, ఆత్మరక్షణ కోసం తాము కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు వివరించారు.

తీవ్ర గాయాలపాలైన గురుప్రీత్ సింగ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనా స్థలం నుంచి రెండు అడుగుల పొడవున్న కత్తిని స్వాధీనం చేసుకున్నామని, అది భారతీయ యుద్ధ విద్యలలో వాడే 'ఖండా' (రెండు వైపులా పదునున్న కత్తి) అని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో పోలీసులు గానీ, ఇతర పౌరులు గానీ గాయపడలేదు. ప్రస్తుతం ఈ కాల్పుల ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. 
Gurpreet Singh
Los Angeles
police shooting
Sikh man
fatal shooting
Khanta sword
Figueroa Street
Olympic Boulevard
LAPD investigation

More Telugu News