Asaduddin Owaisi: ముగ్గురు పిల్లలంటూ మహిళలపై భారం మోపొద్దు.. భాగవత్‌పై ఒవైసీ ఫైర్

Owaisi Fires at Bhagwat Over Three Children Remark
  • ఇది మహిళలపై భారం మోపడమేనని తీవ్ర విమర్శ
  • ప్రజల వ్యక్తిగత జీవితాల్లో జోక్యమెందుకని నిలదీత
  • మోదీ ప్రభుత్వంలో ముస్లింలపై శత్రుత్వం స్థిరపడిందని ఆరోపణ
  • జనాభా పెరుగుదలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్
  • 2011 లెక్కల ప్రకారం ముస్లింలు 14.23 శాతమేనని వెల్లడి
ముగ్గురు పిల్లలను కనాలంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ఈ సూచన భారతీయ మహిళలపై అనవసర భారం మోపడమేనని, ప్రజల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటానికి మీరెవరని భాగవత్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు. దారుసలాంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కుటుంబంలో ముగ్గురు పిల్లలుంటే వారి మధ్య అనుబంధాలు బలపడతాయన్న మోహన్ భాగవత్ మాటల్లో ద్వంద్వార్థాలున్నాయని అసదుద్దీన్ ఆరోపించారు. "భారతీయ మహిళలపై ముగ్గురు పిల్లల భారాన్ని ఎందుకు మోపాలని చూస్తున్నారు?" అని ఆయన నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో ముస్లింలపై శత్రుత్వం స్థిరపడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ సంస్థలు మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని జనాభా పెరుగుదలపై నిరంతరం తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని ఒవైసీ మండిపడ్డారు. వాస్తవాలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని స్పష్టం చేశారు. 2011 జనాభా లెక్కలనే ఇందుకు ఉదాహరణగా చూపుతూ దేశ జనాభాలో హిందువులు 80 శాతం ఉండగా, ముస్లింలు కేవలం 14.23 శాతం మాత్రమే ఉన్నారని ఆయన గుర్తుచేశారు. ప్రజల వ్యక్తిగత, కుటుంబ జీవితాల్లో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని ఆయన తేల్చిచెప్పారు.
Asaduddin Owaisi
Mohan Bhagwat
RSS
AIMIM
Muslim population India
Family planning India
Minorities India
Population control India
Indian women rights

More Telugu News