Telangana Police: వాట్సాప్ స్క్రీన్ షేరింగ్‌తో కొత్త మోసం.. తెలంగాణ పోలీసుల హెచ్చరిక

Telangana Police Warns of New WhatsApp Screen Sharing Scam
  • వాట్సాప్ స్క్రీన్ షేరింగ్‌తో సైబర్ నేరగాళ్ల కొత్త మోసాలు
  • కస్టమర్ సపోర్ట్, బ్యాంకు సిబ్బంది పేరుతో ఫోన్లు
  • తెలియని వ్యక్తులు వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ చేస్తే లెఫ్ట్ అవ్వాలని సూచన
సాంకేతికతను వాడుకుని సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్‌లోని 'స్క్రీన్ షేరింగ్' ఫీచర్‌ను ఆసరాగా చేసుకుని అమాయకుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారని తెలంగాణ పోలీసులు ప్రజలను హెచ్చరించారు. ఈ తరహా మోసాల పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న విధానాన్ని పోలీసులు వివరించారు. వీరు ముందుగా ప్రముఖ కంపెనీల కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌లుగా లేదా బ్యాంకు సిబ్బందిగా పరిచయం చేసుకుని బాధితులకు ఫోన్ చేస్తారు. మీ ఖాతాలో సమస్య ఉందని, సాంకేతిక లోపం సరిచేస్తామని లేదా ఏదైనా సహాయం చేస్తామని నమ్మబలుకుతారు. సమస్యను పరిష్కరించేందుకు వాట్సాప్‌లో స్క్రీన్ షేర్ చేయాలని కోరతారు. వారి మాటలు నమ్మి ఎవరైనా స్క్రీన్ షేర్ చేస్తే, వారి ఫోన్ మొత్తం నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లినట్లే.

ఒకసారి స్క్రీన్ షేర్ చేశాక, మన ఫోన్‌లో ఏం చేస్తున్నామో అవతలి వ్యక్తి చూడగలడు. ఈ క్రమంలోనే వారు మనల్ని బ్యాంకింగ్ యాప్‌లు లేదా ఇతర ఆర్థిక లావాదేవీల యాప్‌లను ఓపెన్ చేయమని సూచిస్తారు. మనం పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు ఎంటర్ చేస్తుండగా వాటన్నింటినీ అవతలి వైపు నుంచి గమనించి, వెంటనే మన ఖాతాలోని డబ్బును వారి ఖాతాల్లోకి బదిలీ చేసుకుంటారు.

"తెలియని వ్యక్తులు మిమ్మల్ని వాట్సాప్ గ్రూపుల్లో యాడ్‌ చేస్తే వెంటనే లెఫ్ట్‌ అవ్వండి. ఇన్వెస్టిమెంట్‌ టిప్స్ వంటివి చెప్తే అస్సలు పాటించకండి. తెలియని గ్రూపుల్లో వచ్చే లింక్స్ క్లిక్ చేయొద్దు. అనుమానాస్పద వాట్సాప్‌ గ్రూపులను రిపోర్ట్‌ చేయండి" అని తెలంగాణ పోలీసులు సూచించారు. పెట్టుబడులు పెట్టాలని లింక్స్ పంపిస్తే క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. ఉచిత రిజిస్ట్రేషన్ పేరిట ఊరిస్తే మోసపోవద్దని సూచించారు.
Telangana Police
Whatsapp scam
cyber crime
screen sharing
online fraud
bank account
cyber security

More Telugu News