Narendra Modi: నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు: బీహార్‌లో వ్యక్తి అరెస్ట్

Narendra Modi Abuse Case Man Arrested in Bihar
  • ఇండియా కూటమి సభలో ఘటన, వీడియో వైరల్
  • ఇది 140 కోట్ల మందికి అవమానమన్న యూపీ సీఎం యోగి
  • దేశ మహిళలందరినీ అవమానించడమేనన్న గోవా సీఎం
  • కాంగ్రెస్, ఆర్జేడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై అసభ్య పదజాలంతో దూషణలకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు బీహార్ పోలీసులు తెలిపారు. అరెస్టైన నిందితుడు సింగ్వారాలోని బాపుర గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. దీనిపై విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

దర్భంగాలో ఇండియా కూటమి నిర్వహించిన రాజకీయ సభలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. మోదీ, ఆయన తల్లిపై చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఖండించారు.

ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఇది 140 కోట్ల మంది భారతీయులను అవమానించడమేనని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు ప్రధాని మోదీ. ఇండియా కూటమి వేదికపై నుంచి ఇలాంటి అగౌరవకరమైన భాష వాడటం సిగ్గుచేటు. దీనికి బీహార్ ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. ఇందుకు కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు క్షమాపణ చెప్పాలి" అని ఆయన డిమాండ్ చేశారు.

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ ఉన్న వేదికపై నుంచి ప్రధాని తల్లిని అవమానించడం దేశంలోని మహిళలందరినీ కించపరచడమేనని అన్నారు. "ఇండియా కూటమి భావజాలం ఎలాంటిదో ఈ ఘటన తెలియజేస్తోంది. భారత ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి చోటు లేదు. దేశం దీన్ని సహించదు" అని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయంగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్, ఆర్జేడీ ఇలాంటి నీచస్థాయి వ్యక్తులను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు.

ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో ఈ ఘటన జరిగింది. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేసినట్లు దర్భంగా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శుక్రవారం వెల్లడించారు.
Narendra Modi
PM Modi
Bihar arrest
India alliance
derogatory comments
Amit Shah
Nitish Kumar

More Telugu News