Narendra Modi: జపాన్, భారత్ కలిస్తే అద్భుతాలే: టోక్యోలో మోదీ

Modi Says India and Japan Partnership Will Create Wonders
  • టోక్యోలో ఇండియా-జపాన్ ఎకనామిక్ ఫోరంలో ప్రధాని మోదీ ప్రసంగం
  • ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపే చూస్తోందన్న ప్రధాని
  • త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని ధీమా
భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచ దేశాలు కేవలం మన వృద్ధిని గమనించడమే కాకుండా మనపై గట్టి నమ్మకంతో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. త్వరలోనే భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జపాన్ పర్యటనలో ఉన్న మోదీ... టోక్యోలో జరిగిన ఇండియా-జపాన్ ఎకనామిక్ ఫోరంలో ప్రసంగించారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... "ప్రస్తుతం భారతదేశంలో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం, పారదర్శక విధానాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ మనదే" అని స్పష్టం చేశారు. దేశంలో పెట్టుబడులు కేవలం పెరగడమే కాకుండా, అవి రెట్టింపు అవుతున్నాయని ఆయన వివరించారు. భారత్, జపాన్ మధ్య భాగస్వామ్యం కేవలం వ్యూహాత్మకమే కాదని, అదొక స్మార్ట్ బంధమని ప్రధాని అభివర్ణించారు. ఈ రెండు దేశాల కలయిక ఆసియా శతాబ్దంలో స్థిరత్వం, వృద్ధి, శ్రేయస్సును నిర్దేశిస్తుందని ఆయన అన్నారు.

సాంకేతిక రంగంలో భారత్, జపాన్ కలిసి పనిచేసే అవకాశాలపై మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. "ఏఐ, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్, అంతరిక్ష రంగాల్లో భారత్ ఎంతో ధైర్యమైన, ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు చేపట్టింది. జపాన్ సాంకేతికత, భారత ప్రతిభావంతుల మేధస్సు కలిస్తే ఈ శతాబ్దపు సాంకేతిక విప్లవానికి నాయకత్వం వహించవచ్చు" అని మోదీ తెలిపారు. ఈ రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాలు ఉమ్మడి శ్రేయస్సుగా మారాయని, జపాన్ వ్యాపారాలకు భారత్ ఒక మంచి వేదిక అని ఆయన పేర్కొన్నారు. 
Narendra Modi
India Japan relations
India economy
Japan India Economic Forum
Indian economy growth
India investments
India technology
Asia stability
India Japan partnership

More Telugu News