Amaravati: అమరావతి మీదుగా బుల్లెట్ రైలు.. తెలుగు రాష్ట్రాల్లో రెండు కీలక కారిడార్లకు ఆమోదం!

Bullet Train Through Amaravati Two Key Corridors Approved in Telugu States
  • ఏపీ మీదుగా రెండు బుల్లెట్ రైలు కారిడార్లకు ప్రాథమిక ఆమోదం
  • హైదరాబాద్-చెన్నై మార్గం రాజధాని అమరావతి మీదుగా నిర్మాణం
  • రాయలసీమ జిల్లాల గుండా హైదరాబాద్-బెంగళూరు మరో కారిడార్
  • సీమ కారిడార్‌లో కర్నూలు, అనంతపురం సహా 6 స్టేషన్లు
  • ప్రధాన నగరాల మధ్య భారీగా తగ్గనున్న ప్రయాణ సమయం
ఆంధ్రప్రదేశ్‌లో బుల్లెట్ రైలు పరుగులు పెట్టేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలోని కీలక ప్రాంతాల మీదుగా రెండు హై-స్పీడ్ రైల్ కారిడార్ల నిర్మాణానికి కేంద్రం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై కారిడార్, రాయలసీమ జిల్లాల గుండా హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులతో రాష్ట్ర రవాణా వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని అంచనా వేస్తున్నారు.

రాజధానిని తాకనున్న హైదరాబాద్-చెన్నై మార్గం
హైదరాబాద్-చెన్నై మధ్య నిర్మించే బుల్లెట్ రైలు మార్గం రాజధాని అమరావతి (సీఆర్‌డీఏ) మీదుగా వెళ్లనుంది. మొత్తం 744.5 కిలోమీటర్ల పొడవైన ఈ అలైన్‌మెంట్‌కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఈ కారిడార్‌లో ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా 448.11 కిలోమీటర్ల మేర ట్రాక్ ఉంటుంది. ఏపీ పరిధిలో అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తడ వద్ద మొత్తం ఎనిమిది స్టేషన్లను నిర్మించనున్నారు. తెలంగాణలో ఆరు స్టేషన్లు ఉంటాయి. ఈ మార్గం శంషాబాద్ నుంచి నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా ఏపీలోకి ప్రవేశించి సీఆర్‌డీఏ గుండా వెళ్తుంది.

రాయలసీమ మీదుగా బెంగళూరుకు బుల్లెట్ ప్రయాణం
మరోవైపు, రాయలసీమ వాసులకు ప్రయోజనం చేకూర్చేలా హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌ను రూపొందించారు. 576.6 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం ఎక్కువగా ప్రస్తుత జాతీయ రహదారికి సమాంతరంగా సాగుతుంది. ఈ మార్గంలో ఏపీ పరిధిలో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, హిందూపురం స్టేషన్లతో పాటు, కియా పరిశ్రమను దృష్టిలో ఉంచుకుని శ్రీ సత్యసాయి జిల్లా దుద్దేబండ వద్ద మరో స్టేషన్‌ను ప్రతిపాదించారు. ఈ కారిడార్‌లో ఏపీలో 263.3 కిలోమీటర్ల మేర రైలు మార్గం ఉంటుంది.

ఈ రెండు కారిడార్లు పూర్తికావడంతో పాటు, ఇప్పటికే ప్రతిపాదనలో ఉన్న బెంగళూరు-చెన్నై ప్రాజెక్టు కూడా అందుబాటులోకి వస్తే... హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు నగరాల మధ్య ఒక బుల్లెట్ రైలు చతుర్భుజి ఏర్పడుతుంది. దీనివల్ల ఈ మహానగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం ఒకటి రెండు గంటలకు తగ్గిపోనుంది. ఇది వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
Amaravati
Amaravati bullet train
Andhra Pradesh bullet train
Hyderabad Chennai bullet train
Hyderabad Bangalore bullet train
High speed rail corridor
AP CRDA
Rayalaseema
Indian Railways
Bullet train project

More Telugu News