KV Vijay Anand: కలెక్టర్‌లదే బాధ్యత.. పింఛన్ ల పంపిణీపై ఏపీ సీఎస్ కీలక ఆదేశాలు

AP CS KV Vijay Anand Warns Collectors on Pension Distribution
  • అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ అందాలన్న ఏపీ సీఎస్ విజయానంద్
  • అర్హులకు పింఛన్ రాలేదంటే కలక్టర్లదే బాధ్యతన్న సీఎస్ 
  • పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలన్న సీఎస్
ఆంధ్రప్రదేశ్‌లో అర్హత గల ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పింఛను అందించాలని, ఎక్కడైనా అర్హత ఉండి పింఛను రాలేదని ఫిర్యాదు వస్తే అందుకు సంబంధిత జిల్లా కలెక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు. చిన్న తరహా నీటిపారుదల ట్యాంకులు, భూగర్భ జలాలు, పిఎం కుసుమ్ పథకానికి భూ సంబంధిత అంశాలు, పింఛన్లు, జిల్లా జువెనైల్ జస్టీస్ కమిటీల ఏర్పాటు, వాటి అమలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధిత అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ అర్హత గల ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పింఛను అందేలా చూడాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ప్రతినెల పింఛను పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా, మండల ప్రత్యేక అధికారులు తప్పక పాల్గొనాలని ఆదేశించారు. పింఛను పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని అర్హతగల వారందరికీ తప్పనిసరిగా పింఛను అందేలా చూడాలని, అర్హత ఉన్నా పింఛను రాలేదని మీడియా, సోషల్ మీడియా లేదా మరే ఇతర మార్గాల్లోనైనా ఫిర్యాదులు వస్తే అందుకు ఆయా జిల్లా కలెక్టర్లే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని సిఎస్ విజయానంద్ పునరుద్ఘాటించారు.

పింఛన్ల తనిఖీకి సంబంధించి లక్షా 35 వేల మందికి నోటీసులు జారీ చేసి నెలరోజుల్లోగా ఎంపిడిఓలకు అప్పీలు చేసుకోవాలని తెలియజేయగా వారిలో 88 వేల 319 మంది ఎంపిడిఓలకు అప్పీలు చేసుకున్నారన్నారు. ఇంకా 23 వేల మంది అప్పీలు చేసుకోలేదని నెలరోజుల గడువులోపు అప్పీళ్లన్నీ పరిష్కరించాలని కలెక్టర్లను సిఎస్ ఆదేశించారు. పింఛన్ల పంపిణీపై ఎక్కడా నెగిటివ్ ప్రచారం రాకుండా చూసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో సిసిఎల్ఏ జి.జయలక్ష్మి, ఆర్టీజిఎస్ సిఇఒ ప్రఖర్ జైన్, ఐఅండ్ పీఆర్ డైరెక్టర్ హిమాన్షు శుక్ల, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, నెడ్ క్యాప్ ఎండి కమలాకర్ బాబు తదితర అధికారులు పాల్గొన్నారు. అదే విధంగా రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్, సెర్ప్ సిఇఓ కరుణ, మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి సూర్యకుమారి, వివిధ జిల్లాల కలెక్టర్లు వర్చువల్‌గా పాల్గొన్నారు. 
KV Vijay Anand
AP CS
pension distribution
Andhra Pradesh
Jagan government
collector responsibility
pension scheme
YSR pension kanuka
welfare schemes
pension verification

More Telugu News