Smita Sabharwal: ఐఏఎస్ స్మితా సబర్వాల్ కు అనారోగ్యం... వెర్టెబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ తో బాధపడుతున్న స్మిత!

Smita Sabharwal Suffering from Vertebral Artery Dissection
  • తన అనారోగ్యం గురించి స్వయంగా వెల్లడించిన స్మితా సబర్వాల్
  • ప్రస్తుతం చైల్డ్ కేర్ లీవ్ లో ఉన్న స్మిత
  • త్వరలోనే కోలుకుంటానని ధీమా వ్యక్తం చేసిన ఐఏఎస్ అధికారిణి
సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. తాను కొన్ని నెలలుగా "వెర్టెబ్రల్ ఆర్టరీ డిసెక్షన్" (VAD) అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్నట్లు ఆమె స్వయంగా వెల్లడించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆమెకు ఆరు నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్‌ను మంజూరు చేయడంతో, ఆమె సెలవుకు గల కారణాలపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ప్రచారానికి తెరదించుతూ, తన అనారోగ్య పరిస్థితిని వివరిస్తూ ఆమె తన ఎక్స్ ఖాతాలో ఒక సెల్ఫీ వీడియోను పంచుకున్నారు.

ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. "ఇది చాలా నొప్పితో కూడిన అనారోగ్యం. దీని నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాను. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మరింత బలంగా తిరిగి వస్తాను" అని ధీమా వ్యక్తం చేశారు. తన ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకోవాలని, తనపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ఆమె కోరారు. స్మిత సబర్వాల్ పోస్ట్ చేసిన వెంటనే, ఆమె అభిమానులు, ఫాలోయర్లు స్పందిస్తూ 'త్వరగా కోలుకోవాలి... జాగ్రత్త తీసుకోండి' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఏమిటీ వెర్టెబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ (VAD)?

మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన ధమనులలో ఒకటైన వెర్టెబ్రల్ ఆర్టరీ లోపలి పొరలో చిన్నపాటి చీలిక ఏర్పడటాన్ని VAD అంటారు. దీనివల్ల మెదడుకు రక్తప్రసరణ తగ్గి తీవ్రమైన తలనొప్పి, మెడనొప్పి, మాట్లాడటంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇది బ్రెయిన్ స్ట్రోక్‌కు కూడా దారితీసే ప్రమాదం ఉంది. అధిక రక్తపోటు, మైగ్రేన్ వంటి సమస్యలు ఈ వ్యాధికి కారణమయ్యే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
Smita Sabharwal
IAS officer
Vertebral Artery Dissection
VAD
health issue
Telangana
child care leave
brain stroke
medical condition

More Telugu News