కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య మేనల్లుడి ఆత్మహత్య
- ఖమ్మం వద్ద రైలు కింద పడి చంద్రశేఖరరెడ్డి మృతి
- ఒంటరితనమే కారణమని ప్రాథమిక నిర్ధారణ
- రెండు వారాల క్రితమే వృద్ధాశ్రమం ఖాళీ చేసిన వైనం
- కాశీ నుంచి నెల్లూరు వెళుతూ ఖమ్మంలో ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన చంద్రశేఖరరెడ్డి ఖమ్మం సమీపంలో గరీభ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. తీవ్రమైన ఒంటరితనమే ఆయనను ఈ దారుణ నిర్ణయం వైపు నడిపించిందని భావిస్తున్నారు. సుమారు 25 ఏళ్ల క్రితమే ఆయన భార్య మరణించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారు అమెరికాలో స్థిరపడ్డారు. దీంతో ఆయన ఒంటరిగా జీవిస్తూ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లోని ఓ వృద్ధాశ్రమంలో చేరారు.
అయితే, 15 రోజుల క్రితం ఆయన ఆ వృద్ధాశ్రమాన్ని ఖాళీ చేసి కాశీ యాత్రకు వెళ్లారు. యాత్ర ముగించుకుని తిరిగి నెల్లూరు వెళుతున్నట్టు మంగళవారం తనకు మనుమడు వరసయ్యే వ్యక్తికి ఆయన ఫోన్‌లో తెలిపారు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి ఖమ్మం రైల్వేస్టేషన్‌లో రైలు దిగిన ఆయన, బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నారు.