Visakha Airport: బ్యాంకాక్, మలేషియా, కొలంబో ఫ్లైట్ సర్వీసులను పునరుద్దరించండి: విశాఖ ఎయిర్ పోర్టు సలహా కమిటీ అధ్యక్షుడు భరత్

Visakha MP Sribharat Seeks Resumption of Bangkok Malaysia Colombo Flights
  • విశాఖ ఎయిర్ పోర్టు సలహా కమిటీ అధ్యక్షుడు, ఎంపీ శ్రీభరత్ అధ్యక్షతన కమిటీ సమావేశం
  • సమావేశంలో పాల్గొన్న ఇన్‌చార్జి డైరెక్టర్ పురుషోత్తం, ప్రభుత్వ విప్‌ గణబాబు, నేవీ అధికారులు, ఇతర కమిటీ సభ్యులు
  • కార్గో సేవలు ప్రారంభించలేమని తేల్చి చెప్పిన అధికారులు
  • సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్న అధికారులు
విశాఖ విమానాశ్రయం నుంచి నేరుగా బ్యాంకాక్, మలేషియా, కొలంబోలకు వెళ్లే అంతర్జాతీయ విమాన సేవలను పునరుద్ధరించాలని విమానాశ్రయ సలహా కమిటీ అధ్యక్షుడు, ఎంపీ శ్రీభరత్ కోరారు. శ్రీభరత్ అధ్యక్షతన జరిగిన సలహా కమిటీ సమావేశంలో ఇన్ఛార్జి డైరెక్టర్ పురుషోత్తం, ప్రభుత్వ విప్ గణబాబు, నేవీ అధికారులు, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ విమానాశ్రయంలోని పలు సమస్యలను ఎంపీ శ్రీభరత్ ప్రస్తావించి అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

విమానాశ్రయంలో ఇన్ లైన్ బ్యాగేజీ చెకింగ్ వ్యవస్థ ఆరు నెలలు గడుస్తున్నా ప్రారంభం కాకపోవడం, ప్రయాణికుల బ్యాగేజీ స్కానింగ్ కోసం ఉన్న యంత్రాల్లో రెండు తరచూ మొరాయిస్తుండటం, ఇంకా మౌలిక వసతుల లోపాలపై ప్రయాణికుల నుంచి విమర్శలు వస్తున్నాయని శ్రీభరత్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

అంతర్జాతీయ కార్గో సేవలు ఏడాది కిందటే ప్రారంభించాలని సూచించినప్పటికీ ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడంపై ఎంపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఏజెన్సీ ప్రతినిధులు.. విశాఖ నుంచి ఎగుమతులకు తగినంత పొటెన్షియల్ లేదని తెలిపారు. ఇక గోవా, పుణే విమాన సేవలు 85 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నప్పటికీ వాటిని నిలిపివేయడాన్ని ఎంపీ ప్రశ్నించగా, ఈ విమాన సేవలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

ప్రయాణికులకు తక్కువ ధరకు ఆహారం అందించేందుకు విశాఖ విమానాశ్రయంలో ‘ఉడాన్ యాత్రీ కేఫ్’ ఏర్పాటు చేయాలని ఎంపీ సూచించారు.

వాష్‌రూమ్ నిర్వహణపై ప్రయాణికుల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని, శుభ్రతపై మరింత దృష్టి పెట్టాలని అధికారులను ఎంపీ ఆదేశించారు. అదనపు విమాన స్లాట్లు కేటాయించాలని నేవీ అధికారులను కోరగా, పైలట్ల శిక్షణ కార్యక్రమాలు నడుస్తున్న కారణంగా ఇప్పుడే కేటాయించడం సాధ్యపడదని వారు తెలిపారు. 
Visakha Airport
Visakhapatnam
Bangkok flights
Malaysia flights
Colombo flights
Air travel
Andhra Pradesh
International flights
MP Sribharat

More Telugu News