Chandrababu Naidu: ప్రతి ఇంటికి ఫ్యామిలీ కార్డు... ఉల్లి రైతులకు నష్టం వాటిల్లకూడదు: చంద్రబాబు కీలక నిర్ణయాలు

Chandrababu Naidu Announces Family Card for Every Home in Andhra Pradesh
  • ఆధార్ తరహాలో కొత్త కార్డుల జారీకి ప్రభుత్వం నిర్ణయం
  • ప్రభుత్వ పథకాల వివరాలన్నీ ఇకపై ఒకే కార్డులో నమోదు 
  • రైతు బజార్ల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశం
ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల పంపిణీని మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఆధార్ కార్డు తరహాలో ఒక ప్రత్యేక 'ఫ్యామిలీ కార్డు'ను జారీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఈరోజు 'ఫ్యామిలీ బెనిఫిట్‌ మానిటరింగ్‌' వ్యవస్థపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి ఒకే కార్డు విధానాన్ని అమలు చేయాలని సూచించారు.

ఈ కొత్త ఫ్యామిలీ కార్డులో ఆ కుటుంబం పొందుతున్న ప్రభుత్వ పథకాలతో పాటు అన్ని రకాల వివరాలను నమోదు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని అప్‌డేట్‌ చేస్తూ, పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబ అవసరాలను నేరుగా తెలుసుకోవాలని, ప్రభుత్వ సహాయం అవసరమైన వారికి తక్షణమే లబ్ధి చేకూరేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "కొన్ని ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదు. అలాంటి వాటిని నివారించేందుకు, అందరికీ ప్రయోజనం కలిగేలా పథకాలను రూపొందించే అంశాన్ని పరిశీలిద్దాం" అని తెలిపారు. రాష్ట్రంలో త్వరలోనే ఒక నూతన జనాభా విధానాన్ని (పాపులేషన్‌ పాలసీ) కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఇబ్బందుల్లో ఉన్న ఉల్లి రైతును ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతుల నుంచి ఉల్లిని తక్షణమే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు నుంచే క్వింటాకు రూ.1,200 చెల్లించి ఉల్లిని కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ఉల్లి రైతుల పరిస్థితి, ఉల్లి ధరలు ఏ మేరకు ఉన్నాయనే అంశంపై ఈ సందర్భంగా చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఉల్లి పంటకు సంబంధించిన క్రయ విక్రయాల అంశంపై చర్చించారు. ఉల్లి పంట దెబ్బ తిన్న కారణంగా... మహారాష్ట్రలో ఉల్లి పంట ఎక్కువగా ఉన్న కారణంగా ధరల విషయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు తెలిపారు. వచ్చే పది రోజుల్లో 5 వేల మెట్రిక్ టన్నుల ఉల్లి పంట వచ్చే అవకాశం ఉందని సీఎంకు అధికారులు వివరించారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..”ఉల్లి రైతులకు నష్టం వాటిల్లకూడదు. క్వింటా ఉల్లిని రూ. 1,200 చొప్పున కొనుగోలు చేయండి. తక్షణం కొనుగోళ్లు ప్రారంభించాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ నుంచి నష్టాన్ని భరించాలి. కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టాలి. ఆరబెట్టిన ఉల్లిని రైతు బజార్లకు పంపిణీ చేయాలి. ఉల్లికి రేటు వచ్చేంత వరకు కమ్యూనిటీ హాళ్లలో నిల్వ చేసుకునేందుకు రైతులకు అవకాశం కల్పించాలి. రైతు నష్టపోకూడదు. వినియోగదారుడు ఇబ్బంది పడకూడదు. అన్ని పంటల ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలి" అని ముఖ్యమంత్రి అన్నారు.

రైతు బజార్ల ఆధునీకరణకు చర్యలు
రాష్ట్రంలోని రైతు బజార్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టాలని సీఎం మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న రైతు బజార్ల సంఖ్యను పెంచాలని సూచించారు. వీటిని 150 నుంచి 200 వరకూ చేసేలా ప్రణాళిక చేయాలని అన్నారు. దీనిపై సీఎం మాట్లాడుతూ "రైతు బజార్లను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాలి. మార్కెట్ యార్డుల్లోని 2-3 ఎకరాల భూమిని వినియోగించుకుని కొత్తగా ఆధునిక రైతు బజార్లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ చేపట్టాలి. మార్కెట్ యార్డుల్లో వేర్ హౌసింగ్, కోల్డ్ చైన్ లను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేయండి. రైతులకు, వినియోగదారులకు ఉపయోగపడేలా మార్కెట్ యార్డు స్థలాలు వినియోగించాలి. ధరల నియంత్రణకు, ద్రవ్యోల్బణం పెరగకుండా ఉండేందుకు ఈ చర్యలు ఉపకరిస్తాయి" అని సీఎం అన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Family Card
Welfare Schemes
Onion Farmers
Rythu Bazars
Price Stabilization
Population Policy
Farmers Welfare

More Telugu News